సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల సర్వీస్ అంశాలపై విచారణ జరిపే అధికారం ఎస్సీ కమిషన్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ శాఖ ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో ఉద్యోగుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన రూపొందించాలని 2001లో సర్కార్ జీవోలు జారీ చేసింది. అయితే ఈ జీవోలను నిలిపివేయాలని విద్యుత్ సంస్థల్లోని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించింది.
స్పందించిన కమిషన్ 2022, నవంబర్ 29న జీవోలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఉత్తర్వుల కారణంగా బీసీ, ఓసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కొండెపాక కుమారస్వామి, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.శరత్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫున సుంకర చంద్రయ్య వాదనలు వినిపించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేశారు. ప్రభుత్వసంస్థల ఉద్యోగుల సర్వీసు అంశాలపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు విచారణ జరిపే అధికారం లేదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
వివరాలను సమర్పించండి
విద్యుత్‌సంస్థల్లో పదోన్నతుల్లో ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చిన ప్రమోషన్లు అన్నింటిని సమీక్షించాలని 2019లో హైకోర్టు విద్యుత్ సంస్థలను ఆదేశించింది. అయినా ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఉన్నతన్యాయస్థానం ఫిబ్రవరి 8న వివరాలను సమర్పించాలని యాజమాన్యాలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment