సాక్షి, హైదరాబాద్: మెట్రో స్టేషన్లతో సిటీ బస్సులను అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు. మెట్రో రైళ్లు, సిటీ బస్సుల మధ్య సమన్వయం కోసం శనివారం బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ మెట్రోకు, ఆరీ్టసీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఎల్‌అండ్‌టీ చీఫ్ స్ట్రాటజీ అధికారి మురళీ వరద రాజన్, చీఫ్ మార్కెటింగ్ అధికారి రిషికుమార్ వర్మ, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్లను అనుసంధానం చేస్తూ బస్సులను నడపడంతో పాటు సర్వీసుల సమయపట్టిక, సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మెట్రో స్టేషన్ల వద్ద ఆర్టీసీ సమాచార కేంద్రాలను, అనౌన్స్‌మెంట్ ఏర్పాట్లను చేయనున్నట్లు పేర్కొన్నారు. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు.
ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లక్ష్యంగా ఈ అనుసంధానం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మెట్రోరైల్ ప్రతినిధుల బృందం చొరవను ప్రత్యేకంగా అభినందించారు. మెట్రో రైలుతో ఆర్టీసీ బస్సుల అనుసంధానం ఆహ్వానించదగిన పరిణామమని ఎల్‌అండ్‌టీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: సకల జనుల సమ్మె కాలపు వేతనం వచ్చిందోచ్.. 11 ఏళ్ల తర్వాత!
Comments
Please login to add a commentAdd a comment