దిల్‌సుఖ్‌నగర్: రాష్ట్రంలోని ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) తెలంగాణ స్టేట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్‌కేపురంలోని కిన్నెర గ్రాండ్ హోటల్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మహిళలు, యువతుల్లో భయాన్ని పోగొట్టి, వారిలో ధైర్యం నింపేందుకు షీ–టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. మహిళలను తమను తాము రక్షించుకునేందుకు సిద్ధం కావాలన్నారు.
అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు, దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా జీహెచ్‌ఎంసీలో అదనంగా మరో పది సీట్లు కేటాయించారన్నారు. మార్కెట్ కమిటీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిం చి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిం చారన్నారు. ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రతి మగవాడి విజయం వెనుక మహిళ ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ ఒక మొక్క నాటాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఐవీఎఫ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళ రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఆర్‌కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, యాంకర్ రవి, బిగ్ బాస్ ఫేమ్ హిమాజా రెడ్డి, లహరి , ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, ఐవీఎఫ్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, ఐవీఎఫ్ మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, స్టేట్ ట్రెజరర్ కోడిప్యాక నారాయణ గుప్తా, యూత్ విభాగం నరేష్ గుప్తా, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment