తల్లిదండ్రులకు ఐటీ నిపుణుల హెచ్చరిక | IT And Communication Expert Warns Parents Over Children Using Smartphones | Sakshi
Sakshi News home page

‘పిల్లలను స్మార్ట్‌ ఫోన్‌లకు వ్యసనపరులు చేస్తున్నారు’

Published Wed, Jul 29 2020 9:38 PM | Last Updated on Thu, Jul 28 2022 7:23 PM

IT And Communication Expert Warns Parents Over Children Using Smartphones - Sakshi

సాక్షి, హైదరాబాద్: కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకు ఇవ్వాలని ఐటీ కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండెళ్లు కూడా నిండని వారికి కూడా స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి వారిని వ్యసన పరులుగా మారుస్తున్నారని, దీని ద్వారా వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బుధవారం జరిగిన ఓ సదస్సులో హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా ‘‘సాంకేతికతకు నేటి తరం పిల్లలు వ్యసన పరులవుతున్నారా’’ అనే అంశంపై ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్‌లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ సైనిక దళాలకు మీడియా శిక్షకురాలుగా ఉన్న జూహీకౌల్  ప్రధాన వక్తగా ప్రసంగించారు.

ఈ సందర్బంగా జూహికౌల్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు అనివార్యమయ్యాయని అన్నారు. అయితే, కనీసం ఎనిమిదేళ్ల పైన వయస్సు ఉన్నపిల్లలకు మాత్రమే ఈ క్లాసులు వర్తింప చేయాలని ఆమె సూచించారు. పదేళ్ల లోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంటకన్నా ఎక్కువ సేపు ఈ ఆన్ లైన్ క్లాసులు ఉండొద్దని, ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్ లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అధిక సమయం ప్రధానంగా అర్ద రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయే విధంగా పేరెంట్స్ తగు చర్యలు చేపట్టాలని సూచించారు.  

ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్ ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియా పై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తీసుకురావోద్దని జూహీకౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్ టాప్ లలో  అనవసరం , ఎప్పుడూ ఉపయోగించని యాప్ లను డిలీట్ చేయాలని అన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి  వస్తుందన్నారు. అనవసర యాప్‌లను తొలగించడంతో పాటు కేవలం విద్యా పరమైన అవసరాలకే  ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా  ఉపయోగిస్తే కలిగే అనర్థాలను   పిల్లలకు అర్ధమయ్యీట్టు చెప్పడం చేయాలని అన్నారు. ప్రతి రోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలని ఆమె తెలియ  చేశారు. ఈ కార్యక్రమంలో  సీఐడీ విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ తో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement