అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే తేడాలెందుకు?
సీడీవోకు ప్రశ్నలు సంధించిన అయ్యర్ కమిటీ
కాఫర్ డ్యామ్ షీట్‌పైల్స్ తొలగించక పోవడంతోనే ఏడో బ్లాక్ కుంగిందా?
డిజైన్లను ఆమోదించాలని సీడీవోపై ఒత్తిళ్లు వచ్చాయా అని ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్‌ను అందించాలని కోరింది.
‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్‌పైల్స్‌ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్‌పైల్స్‌ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది.
ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్
మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్‌లు–ర్యాఫ్ట్‌ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్‌గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్‌వాల్స్‌ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది.
సీడీవోలో ఎవరేం చేస్తారు?
సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది.
డిజైన్ ఉల్లంఘనలేమిటి ?
సీడీవో కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్స్‌ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్‌స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్‌ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్‌ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment