సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులు, ఇంజనీర్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ చీఫ్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సీరియస్ అయ్యారు. శనివారం ప్రాజెక్టు పరిశీలన అనంతరం జలసౌధలో జరిగిన కీలక సమావేశంలో ఇది చోటు చేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకునే క్రమంలో అధికారుల తీరుపై అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో కమిటీ అడిగిన ప్రశ్నలకు.. కొంతమంది అధికారులు క్లారిటీ లేని సమాధానాలిచ్చారు. అలాగే పలు ప్రశ్నలకు సమాధానాలు లేవంటూ నేరుగా చెప్పడంతో కమిటీ నిర్ఘాంతపోయింది. ఈ క్రమంలో.. ఇంజనీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడంతో చంద్రశేఖర్ అయ్యర్ వాళ్లపై గరం అయ్యారు. ఇలా సమావేశంలో మూడుసార్లు ఆయన అధికారులపై సీరియస్ అయినట్లు సమాచారం.
ఈ మీటింగ్‌లో నీటిపారుదల శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులతో పాటు ఈ మూడు బ్యారేజీలకు పని చేసిన వర్క్ ఏజెన్సీలు పాల్గొన్నాయి. అలాగే.. 2016 నుంచి ప్రస్తుతం (ఈనెల 8వ తేదీ దాకా) బ్యారేజీల ఇన్వెస్టిగేషన్, హైడ్రాలజీ, మోడల్ స్టడీస్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో పాల్గొన్నవారు.. ఆయా విభాగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు బదిలీ అయినవారు, పదవీ విరమణ చేసినవారు కూడా విధిగా ఈ మీటింగ్‌కు హాజరు కావడంతో ఎన్‌డీఎస్‌ఏ కమిటీ కీలక సమాచారాన్నే రాబట్టే ప్రయత్ని చేసినట్లు స్పష్టమవుతోంది.
ఇక తమ పర్యటన నేటితో ముగియడంతో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) కమిటీ బృందం ఢిల్లీకి పయనం అయ్యింది. అంతకు ముందు.. గురు, శుక్ర వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కమిటీ సందర్శించింది. భద్రత నడుమ.. కుంగిన ప్రాంతాలను పరిశీలించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించింది. నాలుగు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment