సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు ఉచితంగా సేవలందించేందుకు కాంగ్రెస్ పార్టీ మూడు అంబులెన్సులను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక సాయంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్సులను గాంధీభవన్‌లో సిద్ధంగా ఉంచింది. హైదరాబాద్‌లో 50 కిలోమీటర్ల పరిధి వరకు వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, అంబులెన్స్ అవసరమైన వారు కంట్రోల్ రూం నెంబర్ 040–24601254కు ఫోన్ చేయాలని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు, డిశ్చార్జి తరువాత ఇంటికి వెళ్లేందుకు ఈ అంబులెన్సులను వినియోగించుకోవచ్చని తెలిపాయి. ఏఐసీసీ సూచనల మేరకు కరోనా సేవలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. ఆదివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జెండా ఊపి అంబులెన్సులను ప్రారంభించారు.
వణికిపోతున్న తెలంగాణ పల్లెలు: ఉత్తమ్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ మహమ్మారి పట్టణాలను దాటి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని, ప్రస్తుతం గ్రామీణ తెలంగాణ భయం గుప్పిట్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం కారణంగా ప్రజలు దినదినగండంగా బతకాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో కరోనాపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కడా కనిపించడం లేదని, ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసి మధ్యతరగతి వర్గాలను పీక్కుతింటున్నా ప్రభుత్వానికి చలనం రావడం లేదని మండిపడ్డారు.
పక్కరాష్ట్రాలు కరోనాకు ఉచిత వైద్యం అందిస్తుంటే ఇక్కడి ప్రజలు మాత్రం చికిత్స కోసం లక్షల రూపాయలు వెచ్చించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా పరీక్షల విషయంలోనూ విఫలమైందన్నారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులను సైతం చేయడం లేదని దుయ్యబట్టారు. వెంటనే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక అంబులెన్సులు వేల రూపాయలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే ప్రభుత్వంలో కరువయ్యారని విమర్శించారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీల సూచన మేరకు రాష్ట్రంలో కరోనా బాధితులకు సాయమందించడంలో కాంగ్రెస్ శ్రేణులు అంకిత భావంతో పనిచేస్తున్నాయని ఉత్తమ్ ప్రశంసించారు. తన సొంత ఖర్చుతో అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆయన అభినందించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు కూడా జగ్గారెడ్డి అండగా ఉంటున్నారని, కరోనా బాధితులకు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన కుమార్తె, కాంగ్రెస్ యువ నాయకురాలు టి.జయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరోనా బాధితుల కోసం ఉచిత అంబులెన్సులు
Published Mon, May 24 2021 5:08 AM | Last Updated on Mon, May 24 2021 5:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment