జర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి కేసులో హైకోర్టు.. విచారణ 19వ తేదీకి వాయిదా
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుపై సినీ నటుడు మంచు మోహన్‌బాబు దాడి చేసిన కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి (19వ తేదీ)వాయిదా వేసింది. తన కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారమే కేసు నమోదైనప్పటికీ న్యాయ సలహాలు తీసుకున్న పోలీసులు, గురువారం బీఎన్‌ఎస్ 109 (హత్యాయత్నం) సెక్షన్ జోడించారు.
కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జర్నలిస్ట్‌లమంటూ చాలామంది ఇంట్లోకి తోసుకొచ్చారని, ఈ క్రమంలో అనుకోకుండా దాడి జరిగింది తప్ప కావాలని చేసింది కాదని చెప్పారు. ఏపీపీ జితేందర్‌రావు వాదనలు వినిపిస్తూ..మోహన్‌బాబు కుమారుడు మనోజ్ ఆహ్వానం మేరకే వారు వచ్చారని చెప్పారు. చానల్ లోగోతో కొట్టడంతో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment