ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జేపీ నడ్డాతో కిషన్‌రెడ్డి. చిత్రంలో బీఎల్ సంతోష్
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పట్ల బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న ప్రచారంతో పార్టీలో గందరగోళం నెలకొందని.. రెండింటి మధ్య అవగాహన కుదిరిందన్న ప్రచారం ఇబ్బందికరంగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచూ బీఆర్‌ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలపై ఘాటుగా ఆరోపణలు చేయడానికే పరిమితమవుతూ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయని వివరించినట్టు సమాచారం. దీనిపై స్పందించిన నడ్డా.. అన్ని అంశాలూ తమ దృష్టిలో ఉన్నాయని, ఆందోళన చెందవద్దని సూచించినట్టు తెలిసింది.
అవినీతికి పాల్పడే వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. తగిన సమయంలో కచ్చితంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నట్టు సమాచారం. నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లి, ప్రజల మద్దతు కూడగట్టాలని.. తాము వెంటే ఉండి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జులతో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినప్పుడు రాష్ట్ర నేతలు పలు అంశాలను లేవనెత్తగా.. జాతీయ పార్టీ తరఫున నడ్డా స్పష్టత ఇచ్చారు.
బీఆర్‌ఎస్ పట్ల మెతక వైఖరి ఉండదు!
భేటీ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీం అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఇబ్బందికరంగా మారిందని రాష్ట్ర ముఖ్యనేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు నడ్డా దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నందున తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం. దీనిపై స్పందించిన నడ్డా.. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కచ్చితంగా అవకాశాలు ఉన్నాయి.
అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పార్టీ నాయకత్వం దృష్టిలో అన్ని అంశాలు ఉన్నాయి. తగిన సమయంలో కచ్చితంగా అవసరమైన చర్యలు ఉంటాయి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. పార్టీ బలోపేతం, ప్రజల్లో మద్దతు కూడగట్టడంపై సమన్వయంతో ఐక్యంగా కృషి చేయండి’’ అని స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఏపీలో పార్టీ పరిస్థితిపైనా చర్చ
భేటీ సందర్భంగా ఏపీలో పార్టీ ప్రస్తుత పరిస్థితిపై చర్చకు వచ్చినట్టు తెలిసింది. అక్కడ చేపడుతున్న కార్యక్రమాలు, వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతున్నదన్న అంశాలు, ఇతర సంస్థాగత పరిస్థితులను ఆ రాష్ట్ర నేతలు నడ్డాకు వివరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి రాజకీయంగా పెద్దగా ఆశాజనకంగా లేదని.. క్షేత్రస్థాయిలో అంతగా బలపడనందున వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలు తక్కువనే చర్చ జరిగినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment