బుధవారం నల్లగొండ జిల్లా హాలియా మండలం అలీనగర్ వద్ద జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో అభివాదం చేస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు
సాక్షి, నల్లగొండ: ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతోంది. గ్రామాలు పచ్చబడ్డాయి. తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఇవన్నీ ఇంటికిపోయి ఆలోచించండి. నేను చెప్పింది అబద్ధమైతే టీఆర్‌ఎస్‌ను ఉప ఎన్నికలో ఓడించండి. నిజమైతే మిగతా పార్టీలకు డిపాజిట్ దక్కకుండా చేయాలి.’అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతోపాటు.. మరో 13 ఎత్తిపోతల పథకాలకు ఆయన బుధవారం తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లు వద్ద ఒకేసారి శంకుస్థాపన చేశారు. అనంతరం హాలియా మండల పరిధిలోని 14వ మైలురాయి (అలీనగర్) వద్ద జిల్లా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతుల ధన్యవాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారభేరీగా సాగిన ఈ సభలో ఆయన నల్లగొండ జిల్లాపై వరాలు కురిపించారు.
గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం
‘కృష్ణానదిలో సాధారణంగా నీరు తక్కువగా వస్తుంది.. రెండేళ్లుగా వర్షాలు సమృద్ధిగా రావడం వల్ల ఇబ్బంది లేదు. వర్షాలు రానప్పుడు లిఫ్ట్‌లు నిలిచిపోకుండా గోదావరి జలాలతో ïసీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తాం. ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు తరలిస్తాం. లిఫ్టు ద్వారా గోదావరి జలాలను పెద్దదేవులపల్లికి తరలించి గోదావరి– కృష్ణా నదులను అనుసంధానం చేస్తాం. రూ.600 కోట్లతో అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సాగునీటి కష్టాలు తీరి నల్లగొండ కళకళలాడుతుంది. గోదావరి జలాలు తెచ్చి నల్లగొండ ప్రజల కాళ్లు కడుగుతా’అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా ఎంతో అన్యాయానికి గురైందని, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి జిల్లాను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు జరిగిన అన్యాయం ఇక జరగవద్దని, తానే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అభివృద్ధి పనులు చేపడతానన్నారు.
తిరుమలగిరి(సాగర్) మండలం నెల్లికల్లు వద్ద లిఫ్ట్‌ల శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ చేస్తున్న సీఎం కేసీఆర్
కొత్త పెన్షన్లు– రేషన్ కార్డులు
‘కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్‌లో పడిపోయాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కరోనా దెబ్బకొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు, అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు మంజూ చేస్తా’అని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకుండా నూతన రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
దళితుల అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.వేయి కోట్లు
‘దళితజాతి ఇంకా వెనుకబడే ఉంది. అందరం సిగ్గుపడాల్సిన పరిస్థితి. అన్ని వర్గాలూ బాగుపడాలి. అప్పుడే రాçష్టం మరింత అభివృద్ధి చెందుతుంది. బడ్జెట్‌లో దళిత అభివృద్ధి కోసం వేయి కోట్లు పెడతా. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటం.. నేనే పర్యవేక్షిస్తా’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణను బంగారు తునక చేసేందుకు కష్టపడుతున్నా... ప్రజలు గుర్తించాలన్నారు. ఎక్కడైన గాలి మాటలు మాట్లాడితే అవి విని మోసపోవద్దని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ‘మమ్మల్ని నిలబెట్టే బాధ్యత మీదే. నేను చెప్పిన మాటల్లో ఒక్కటి అబద్దం ఉన్నా టీఆర్‌ఎస్‌ను ఓడించండి. నిజమైతే ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకుండా చేయండి. సాగర్ ఉప ఉన్నికల్లో ఆలోచించి ఓటు వేయండి. రాజకీయ గుంట నక్కల మాటలు నమ్మి మోసపోవద్దు. అండగా ఉండండి... మిమ్ములను కాపాడుకుంటా’అంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎత్తిపోతల పథకాల మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు
ఏడాదిన్నరలో ... ఎత్తిపోతలు పూర్తి
‘నల్లగొండ జిల్లాలో 13 లిఫ్టులను రూ.2,500 కోట్లతో చేపడుతున్నాం. వీటిని ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోం’అని సీఎం స్పష్టం చేశారు. ఎడమ కాలువ కింద ఎకరా మిగలకుండా నీరు ఇవ్వడమన్నదే తన ఉద్దేశమన్నారు. ‘చాలెంజ్ చేస్తున్న .. లిఫ్ట్‌లు ఏడాదిన్నరలో పూర్తి కాకపోతే ఓట్లు అడగం..’అని సవాల్ చేశారు. నోముల నర్సింహయ్య తన పక్కన లేడని చాలా బాధగా ఉందన్నారు. మిషన్ భగీరథ నీరు ఇస్తేనే ఓట్లు అడుగుతామని ఎన్నికలకు ముందు చెప్పిన పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులని, విచక్షణతో ఆలోచించాలన్నారు.
నల్లగొండకు నిధుల వరద... ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు
సీఎం కేసీఆర్ హాలియా సభలో నల్లగొండ జిల్లాకు నిధుల వరద పారించారు. సర్పంచ్‌లు బాగా పనిచేస్తున్నారని, వీరికి తోడ్పాటునందించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రాలకు రూ.30 లక్షలు, జిల్లా కేంద్రమైన నల్లగొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీ రూ.5 కోట్లు, మిగిలిన 6 మున్సిపాలిటీలకు ఒక్కో కోటి రూపాయల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ అవాకులు, చవాకులు పేలుతోంది
‘కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు పేలుతోంది. బీజేపీది కొత్త బిచ్చగాళ్ల వ్యవహారం. మిడిసి పడొద్దు. వీరు పిడికెడు.. తలుచుకుంటే దుమ్ము దుమ్ము అయితరు. సభనాడు వచ్చి గోల చేయడం సంస్కారం కాదు. ప్రజలే తీర్పు చెబుతరు. పార్టీలు, నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. చాలా మందితో పోరాడినం. తొక్కిపడేస్తం..’అని సీఎం కేసీఆర్ విపక్షాలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సీఎల్పీ నాయకుడు ఆదిలాబాద్ వరకు పొలంబాట – పోరు బాట అంటున్నడు.. పొలానికి ఏమైంది? బుద్ధిమంతుల్లా ఉంటే మంచింది. డంబాచారాలు చెప్పుకునే ప్రభుత్వం కాదు మాది’అని పేర్కొన్నారు.
‘తెలంగాణలో దుస్థితికి కారకులు ఎవరు? కాంగ్రెస్‌కు తెలంగాణ అనే పదం ఉచ్చరించే హక్కు లేదు. రైతుల ఆత్మహత్యలకు ఈ పార్టీ కాదా కారణం..? హైదరాబాద్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేది. విభిన్న సంస్కృతితో విలసిల్లింది. అలాంటి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెస్ దుర్మార్గులు కాదా’అని మండిపడ్డారు. ఒక ముక్క మహారాష్ట్రలో, మరో ముక్క ఏపీ, ఇంకోటి కర్నాటకలో కలిపారన్నారు. గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ నాయకలు పైరవీల కోసం, పదవులు, పైసల కోసం ఆలోచించారు తప్ప ప్రజలను పట్టించుకోలేదన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా హాలియా మండలం అలీనగర్ వద్ద జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభకు హాజరైన ప్రజలు. అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి .. లేదంటే మీకే నష్టం
బహిరంగ సభలో కొందరు బీజేపీ కార్యకర్తలు కేకలు వేయడంతో సీఎం సీరియస్ అయ్యారు. ‘అయిదుగురులేరు మీరు... వెళ్లిపోండి. మా వాళ్లు తలుచుకుంటే మీరు నశ్యం అవుతారు. పిచ్చిపనులు చేయొద్దం’టూ హెచ్చరించారు. ‘బీజేపీ కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లుగా వ్యవహరిస్తోంది. మీలాగా మాట్లాడటం చేత కాకకాదు. మీరు పిడికెడు, తలుచుకుంటే నశ్యం.. నశ్యం అవుతరు. మీరూ సభ పెట్టుకోవాలి. ఏదైనా ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. మేము పెట్టుకున్న సభను అడ్డుకోవడం సరికాదు. ఇలాంటి పిచ్చి చేతలు మానుకోవాలి’అంటూ హెచ్చరించారు.
ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే .. ఎత్తిపోతల అవసరం వచ్చేదే కాదు
‘నాగార్జునసాగర్‌ను ఇప్పుడున్న చోట కాకుండా 19 కిలోమీటర్ల పైన... ఏలేశ్వరం వద్ద నిర్మించాల్సి ఉండే. కేఎల్‌రావు అనే దుర్మార్గుని వల్ల అన్యాయం జరిగింది. దీంతోనే నేడు లిఫ్ట్‌లు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆనాడు కాంగ్రెస్ నేతలు కళ్లు మూసుకోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొంది. ఏపీకి అనుకూలంగా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోలేకపోయారు. 2007లో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి, రైతుల ఇబ్బందులు తెలుకున్న. ఆనాడు ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాలేదు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వను.. ఏం చేస్తారో చేసుకోండి అన్నా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు నోరు మెదపలేదు. అలాంటి నాయకులు నేడు పొలంబాట, పోరుబాట.. బొందబాట అంటూ తిరుగుతున్నరు’.. అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘నేను ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటే కమీషన్ల కోసం అంటున్నరు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును మీరు కట్టింది.. కమీషన్ల కోసమేనా’అని నిలదీశారు.
ప్రజలు మౌనంగా ఉండరాదు
ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉండరాదని, చైతన్యంతో ఉండాలని సీఎం అన్నారు. ‘జిల్లాలో 1.50 లక్షల మందిని ఫ్లోరిన్ పొట్టన పెట్టుకుంది.. ఒక్కరన్నా దానిపై మాట్లాడిండ్రా..? ఒక్కరన్నా ఉద్యమించారా? నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి టేబుల్ మీద ఫ్లోరిన్ బాధితుడిని ఉంచి తమ గోడును వెల్లబోసినా సమస్య పరిష్కారం కాలేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టినం. మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినం. అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేదు.. ఇయ్యాల పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’అని మండిపడ్డారు. తెలంగాణ రాకుముందు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు భారతదేశంలోనే 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.
కాంగ్రెస్ పొలంబాట, పోరుబాట ఎందుకు చేస్తోంది?
మేము రైతులకు నాణ్యమైన కరెంటు, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నందుకు కాంగ్రెస్ పొలంబాట–పోరుబాట చేస్తోందా? అని కేసీఆర్ నిలదీశారు. ‘రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆనాడు 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నేడు రైతు బీమాతో వారం రోజుల్లోనే రూ.5లక్షలు రైతు కుటుంబానికి అందిస్తున్నాం. కాంగ్రెస్‌కు కడుపుమంట.. రెతుని ఆదుకునేందుకు విజయ డెయిరీ పాలసేకరణ ధరను పెంచాం. మిషన్ కాకతీయలో 48 వేల చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరిగాయి. ఈ విషయాన్ని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పింది. దేశంలో ఆత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ. 1.10 కోట్ల ఎకరాల్లో వరి సాగుచేశాం. దీనిని వచ్చేసారి మరో 85 లక్షల ఎకరాలు పెంచుతాం’అని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి దేశంలో ఎక్కడాలేదని, ఆడబిడ్డలు బరువు కావద్దన్న ఉద్దేశంతో తానే స్వయంగా ఆలోచించి పథకం పెట్టానన్నారు. కంటి వెలుగుతో ఉచితంగా అద్దాలు, కేసీఆర్ కిట్టుతో గర్భిణులను ఆదుకుంటున్నామని.. ఆడబిడ్డ çపుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు అయితే 12వేలు ఇçస్తున్నామని, ఇదంతా గ్రామాలకు వెళ్లి ఆలోచించుకోవాలని కోరారు.
ధరణితో .. అవినీతికి చెక్
‘రెవెన్యూలో, రిజిస్ట్రేషన్ శాఖల్లో లంచాలు తగ్గించేందుకు ధరణి తీసుకువచ్చాం. ధరణి ద్వారా పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అవుతున్నాయి. దీంతో లంచాల భారం పోయింది. అందుకోసమని కాంగ్రెస్ పోరుబాట చేస్తోందా..? మీది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. గ్రామాలను రావణ కాష్టంలా మార్చారు. త్వరలోనే భూ పంచాయితీల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోబోతున్నాం. దే«శంలోనే భూ పంచాయితీలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతుంది’అని సీఎం పేర్కొన్నారు.
పేదరికం పోవాలి
‘రాష్ట్రంలో యాదవులను ఆదుకునేందుకు గొర్రెల పంపిణీ పథకం పెట్టాం. 7.50 లక్షల దరఖాస్తులు రాగా 3.70 లక్షల యూనిట్లు అందించాం. ఈ బడ్జెట్‌లో మరో 2 లక్షల యూనిట్లకు నిధులు కేటాయిస్తాం. కాంగ్రెస్ నాయకులేమో గొర్రెలు మేసిండ్రు అని విమర్శించారు. మత్య్సకారులను ఆదుకునేందుకు రూ.160 కోట్లతో ఉచిత చేపపిల్లల పథకం ప్రవేశపెట్టాం. నాయీబ్రాహ్మణుల కోసం ప్రతి గ్రామంలో ఆధునిక క్షౌ రశాలల ఏర్పాటుకు ఒక్కో యూనిట్‌కు లక్ష రూపాయలు మంజూరు చేయనున్నాం’అని ప్రకటించారు.
టీఆర్‌ఎస్‌ది క్లీన్ గవర్నమెంట్
‘రైతుబంధును రూ.15 వేల కోట్లతో చేపడుతున్నాం. ఠంచనుగా రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడైనా చూశామా.? రూ.500 ఇస్తే.. రూ.250 లంచాలకే పోయేది. ఇది టీఆర్‌ఎస్ గవర్నమెంట్.. క్లీన్ గవర్నమెంట్. అవినీతి రహిత ప్రభుత్వం మాది. కాంగ్రెస్ నాయకులకు సిగ్గు ఉండాలి. రైతుబంధు ద్వారా లబ్ధి పొందుతరు.. మళ్లీ రోడ్లమీదకు వచ్చి అంటరు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 2,600 రైతు వేదికలను నిర్మించాం. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12,768 గ్రామాల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించాం. గ్రామాల రూపురేఖలన్నీ మారిపోయాయి. హరితహారం ద్వారా చెట్ల పెంపకం జరుగుతోంది. గతంలో అమెరికా స్టోరీలే వినేవాళ్లం. నేడు తెలంగాణ గురించి వారే తెలుసుకునే పరిస్థితి వచ్చింది. గ్రామాలన్నీ అంత పరిశుభ్రంగా తయారయ్యాయి. సర్పంచులు బాగా పనిచేస్తున్నారు.
వైకుంఠధామాలతో గ్రామాల్లో దహన సంస్కారాలు గౌరవంగా చేసుకునే వీలు కలిగింది. అన్ని కులాల వారికి వీటివల్ల మేలు జరుగుతుంది’అని అన్నారు. గిరిజన తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఏనాడూ ఏ ప్రభుత్వాలు వారి గురించి ఆలోచించిన పాపానపోలేదన్నారు. దామరచర్లలో 4వేల మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని , రెండేళ్లలో పూర్తవుతుందని, దీనికోసం రూ.35వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అన్నారు. ‘యాదాద్రిని ఎవరూ పట్టించుకోలేదు. రూ.2వేల కోట్లతో పనులు చేపడుతున్నం. ప్రపంచమే వచ్చి చూసి పోతది. ఇవన్నీ చూసే కాంగ్రెస్‌కు కన్నుకుడుతోంది. ధర్మాన్ని గెలిపించాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, విప్ గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment