సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని.. ప్రజలు తమ పార్టీ, ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్‌లో వివిధ అభివృద్ధి పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన సోమవారం సుడిగాలి పర్యటన చేశారు.
ఉగాది నుంచి వరంగల్ మహానగర ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఒక్కరోజు ముందుగానే రూ.1,589 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాంపూర్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత పలుచోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. ఖిలావరంగల్, న్యూశాయంపేటల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.75 పింఛన్ ఇచ్చేవారు. వాడకట్టులో 50 మందికి వస్తే 500 మందికి రాకపోయేది. కొత్త వారికి కావాలంటే ఎవరో ఒకరు చనిపోతే మీ పేరు రాస్తమనేటోళ్లు.
కాంగ్రెసోళ్లు వచ్చి రూ.75ను రూ.200 చేసి, భారత్‌లో ఎవరూ చేయనట్లు వారే చేశామని డైలాగులు కొట్టారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పెన్షన్‌ను రూ.2016 చేసుకున్నం. గతంలో 29లక్షల మందికే పింఛన్ వచ్చేది. ఇప్పు డు 40 లక్షల మందికి ఇస్తున్నం. త్వరలోనే అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తం’అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటుంటారు.. కానీ సీఎం కేసీఆర్ ఆ ఇళ్లు నేనే కడతా, పెళ్లి నేనే చేస్తా అంటున్నరు. పేదల కష్టసుఖాలు తెలిసిన మన ముఖ్యమంత్రి ఆ రెండూ చేస్తున్నరు. పేదింటి మేనమామగా నిలుస్తున్నరు’అని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో అక్కడక్కడా ఆలస్యం జరిగినా.. ప్రతీ పేదవాడికి ఇల్లు, పేదింటి ఆడ బిడ్డ పెళ్లిని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు.
పలు చోట్ల అడ్డగింత..
కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ, ఇతర పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఆదివారం రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. అయినా.. ఏబీవీపీ, పీడీఎస్‌యూ నాయకులు వరంగల్ పోచమ్మమైదాన్, హన్మకొండలోని కేయూ కూడలి వద్ద కాన్వాయ్‌కు అడ్డొచ్చారు. అయితే, అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని నిలువరించి పక్కకు తొలగించారు.
కాంగ్రెస్‌ది మొండిచేయి.. బీజేపీది గుడ్డిచేయి..
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా బీజేపీ వాళ్లు ఎగిరెగిరిపడుతున్నరు. మోదీ ఆనాడు జన్ ధన్ ఖాతా ఖోలో.. పంద్రా లాక్ లేలో.. అన్నరు. రూ.15 లక్షలు ఎంతమందికి వచ్చాయో చెప్పండి’అని మంత్రి అడిగారు. ఎవరూ స్పందించకపోవడంతో ‘కాంగ్రెసోళ్లది మొండిచేయి, బీజేపీది గుడ్డిచేయి’అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు వరంగల్ మీద ప్రేమ ఉండటం వల్లే బడ్జెట్‌లో ఏటా రూ.300 కోట్లిస్తూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వరంగల్‌లో ఒకేరోజు రూ.2,500 కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేసుకున్నామని వెల్లడించారు. వరంగల్‌కు నియో రైలు, మామునూరుకు ఎయిర్‌పోర్టు తెస్తామని, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అయితే, వరంగల్‌ను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
వరంగల్‌లోని ఆడబిడ్డల దాహార్తిని రూ.1,589 కోట్లతో తీరుస్తామని మాట ఇచ్చి ఉగాదికి ఒక రోజు ముందే చేసి చూపించిన ప్రభుత్వం తమదని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని, దానిపై దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ విసిరారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నేతలకు ఇదే చివరి హెచ్చరిక..
‘సీఎం కేసీఆర్ వయసు, హోదా కూడా చూడకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నరు. ఇదే మీకు చివరి హెచ్చరిక. కేసీఆర్‌ను దూషిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఎన్‌ఐటీలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న కేసీఆర్ నీతిఆయోగ్ లాంటి సంస్థల ప్రశంసలు అందుకున్నారని, స్వయంగా కేంద్రమే అభినందిస్తుంటే కొందరు కొత్త బిచ్చగాళ్లు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు.
మేం నరేంద్ర మోదీ, అమిత్‌షాపై మాట్లాడవలసి వస్తుందన్నారు. ‘నేను తమ్ముడు సునీల్‌నాయక్ వీడియోను చూశా. ఐఏఎస్ కావాల్సిన వాడిని ఆత్మహత్య చేసుకుంటున్నా.. అన్న అతని మాటలు నన్ను చాలా బాధించాయి. ఐఏఎస్ నోటిఫికేషన్ కేంద్రం, యూపీఎస్‌సీ ఇస్తుందన్న విషయం కూడా చెప్పకుండా కొందరు రెచ్చగొట్టారు. వరుస ఎన్నికల వల్ల నోటిఫికేషన్ ఇవ్వలేకపోయాం. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తం’అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment