
అకాల వర్షం రైతులను కష్టాలను పాల్జేస్తోంది. ఆరుగాలం పండిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ‘టౌటే’ తుపాను అత్యంత తీవ్ర తుపానుగా మారి పలు రాష్ట్రాలను వణికిస్తోంది. గుజరాత్, కేరళ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక కరోనా విజృంభణతో దేశ ప్రజలు అల్లాడుతున్నారు.

అత్యంత తీవ్ర తుపాను.. టౌటే కేరళలో తుపాను ధాటికి కూలిన ఇళ్లు

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో వర్షానికి తడిసిన ధాన్యం. కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్లే ధాన్యం తడిసిందంటూ ఆదివారం నిరసన తెలుపుతున్న రైతులు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి కొనుగోలు కేంద్రంలో వర్షానికి కొట్టుకుపోతున్న ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఖుదావంద్‌పూర్‌కు చెందిన నర్సింలుకు మూడ్రోజులుగా తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు.. మందులు వాడినా తగ్గలేదు. భార్యతో కలిసి శనివారం రాత్రి 11 గంటలకు ఆస్పత్రికి వచ్చాడు. ఆదివారం ఉదయమే పరీక్ష చేయించుకోవడానికి వీలుగా తన వంతు కోసం ఆ రాత్రే చెప్పులను క్యూలో ఉంచాడు. రాత్రంతా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రి ఆవరణలోనే భార్య ఒడిలో సేదదీరాడు. తెల్లారగానే టోకెన్ తీసుకుని.. మధ్యాహ్నం 12కి పరీక్ష చేయించుకోగా, పాజిటివ్ వచ్చింది. కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రయాసగా మారిన తీరుకు ఇదో నిదర్శనం.

లాక్‌డౌన్ ఆంక్షలతో ఉదయం పది గంటలలోపు అన్ని పనులూ పూర్తి చేసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పెద్దపల్లిలో రాజీవ్ రహదారిపై ఉదయం వేళ ఒకే ద్విచక్రవాహనంపై ఐదుగురు ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తూ సాక్షి కెమెరాకు కనిపించారు. ఆంక్షలతో ఇలా వెళ్లడం తప్పడంలేదంటున్నా ప్రాణం విలువైందంటున్నారు పోలీసులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

లాక్‌డౌన్ విరామ వేళ ఆదివారం ఉదయం 8.15 గంటల సమయంలో రద్దీగా మారిన నిజామాబాద్ పట్టణంలోని మార్కెట్ (పైన ఫొటో). లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్న హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతం(కింద ఫొటో).

లాక్‌డౌన్ సందర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ద్విచక్రవాహనంపై నిబంధనలు అతిక్రమిస్తూ వెళ్తున్న ఓ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న కానిస్టేబుల్‌కు సీఐ మహేందర్‌రెడ్డి క్లాస్ తీసుకున్నారు. ‘ఏం పోలీసువయ్యా ను వ్వు? అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ను వ్వు.. ఇలా నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే ఎలా?’అంటూ మందలించారు. మళ్లీ అలా కనిపిస్తే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది.

ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఇంట్లో నీడపట్టున ఉండేలా చర్యలు తీసుకుని మేమంతా ఎండనకా, వాననకా రోడ్లపై విధుల నిర్వహిస్తుంటే గుర్తించకపోవడం బాధాకరమనీ, మరొకమారు ఇలా రావద్దంటూ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ వద్ద పోలీసు సిబ్బంది పలువురు పాదచారులకు దండం పెట్టి మరీ వేడుకున్నారు. ఇప్పుడు దండంతో సరిపెట్టాం.. మరోమారు కనిపిస్తే లాఠీలకు పనిచెబుతామంటూ హెచ్చరించి పంపారు.

కోవిడ్ భయంతో గ్రామాల్లోని ప్రజలు పొలంబాట పడుతున్నారు. పగటిపూట చెట్లకింద, రాత్రి పూట షెడ్లలో సేదతీరుతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం పంచాయతీ పరిధిలో ఓ కుటుంబం పొలం వద్దే కాలం గడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment