సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం నడుస్తుండగా.. కేటీఆర్ ప్రచారం కోసం వినూత్నంగా ఆలోచించారు. సోషల్ మీడియాను బేస్ చేసుకుని ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే తెలంగాణ యాసతో సోషల్ మీడియాలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ‘మై విలేజ్ షో’ టీమ్‌తో ఓ ప్రోగ్రామ్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో కేటీఆర్ స్వయంగా నాటు కోడి కూర వండి.. పచ్చటి పొలాల మధ్య దావత్ చేసుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ తనకు సంబంధించిన కొన్ని విషయాలను గంగవ్వ అండ్ టీమ్‌తో షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, కరీంనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్.. అదే వేదిక మీద ఉన్న గంగవ్వతో మాట్లాడారు. ఈ సమయంలోనే.. తన మై విలేజ్ షో ఛానల్‌కు సమయం ఇవ్వాలని కోరగా.. కచ్చితంగా ఏదో ఒక రోజు వస్తానని ఆ సభా వేదికగా గంగవ్వకు కేటీఆర్ మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట మేరకు.. కేటీఆర్ మై విలేజ్ షోకు వెళ్లారు. అక్కడ గంగవ్వతో పాటు అనిల్ జీలా, అంజి మామతో కలిసి స్వయంగా నాటుకోడి కూర, గుడాలు, బగార అన్నం వండారు కేటీఆర్. ఈ మొత్తం ప్రోగ్రామ్‌ను వీడియో తీశారు.
నవ్వులే నవ్వులు..
ఇక, అందులో కేటీఆర్‌తో గంగవ్వ ముచ్చట్లు నవ్వులు పూయించాయి. ఏమనుకోవద్దు అనుకుంటూనే.. కేటీఆర్‌ను ప్రశ్నలు అడిగింది గంగవ్వ. కేసీఆర్‌తో తనకు ఎప్పుడైన గొడవలు అయ్యాయా అని అడగ్గా.. గొడవలు జరగని ఇళ్లు ఉండదని.. వాళ్లకు కూడా జరిగాయని చెప్పారు కేటీఆర్. కేసీఆర్‌ను ఏమని పిలుస్తావ్ అని అడగ్గా.. బయట సార్ అని, ఇంట్లో మాత్రం డాడీ అని పిలుస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే.. వాళ్ల టీంతో పాటు కేటీఆర్ టమాటలు కట్ చేశారు. ముచ్చట్లు చెప్తూనే అందరి కంటే ముందే కోసేశారు. అమెరికాలో ఉన్నప్పుడు తానే అన్ని పనులు చేసుకున్నానని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏ కూర బాగా వండుతారని అంజిమామ అడిగితే.. తాను అన్ని బాగానే వండుతా కానీ.. అది తినే వాళ్ల మీద ఆధారపడి ఉంటుందంటూ నవ్వులు పూయించారు.
కవితతో అనుబంధం..
ఇలా.. తన కుటుంబం గురించి, ఎమ్మెల్సీ కవితతో అనుబంధం గురించి కేటీఆర్ చెప్పారు. అటు వంట చేస్తూ.. మధ్య మధ్యలో తన పర్సనల్ విషయాలు పంచుకుంటూనే.. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు కేటీఆర్. మొత్తానికి నాటు కోడి కూరతో బగారా అన్నంతో గంగవ్వ టీంతో కలిసి సరదా సరదాగా ముచ్చట్లు చెప్పుకుటూ కేటీఆర్ జబర్ధస్త్ దావత్ చేసుకున్నారు. అటు దావత్ చేసుకుంటే.. మధ్యలో బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికల ప్రచారం కానిచ్చేశారు. ఈ వీడియోపై నెటిజన్ల స్పందిస్తూ.. వినూత్న ప్రచారం చేయడంలో మంత్రి కేటీఆర్‌ను మించిన వ్యక్తి లేడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment