సాక్షి, ఢిల్లీ: బీఆర్‌ఎస్ హయాంలో ఎక్కువ కమీషన్ కోసమే రీ-డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రజల లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ శనివారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తులు, తదితర అంశాలపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితిపై కూడా చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మత్తులు తదితర అంశాలపై చర్చించారు. ఇక, ఈ చర్చ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ అధికారులతో రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. సోమవారం ఇంజనీర్ల స్థాయిలో మరోసారి సమావేశం జరుగుతుంది. ఎక్కువ కమీషన్ కోసం రీ-డిజైన్ పేరుతో ప్రాణహిత ప్రాజెక్ట్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్‌గా మార్చింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజక్టు మార్చడం తప్పు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చారు. ఏడాదికి తొమ్మిది వేల కోట్లు తెలంగాణ ప్రజల డబ్బును వడ్డీ రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు. కాళేశ్వరం కింద అరకొరగా సాగు మాత్రమే అవుతోంది. బీఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం ఆరు అడుగుల లోతుకు ప్రాజెక్ట్ కుంగిపోయింది.
మేడిగడ్డ పునాది బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లు చేస్తున్నాం. కాళేశ్వరం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని కిందకి వదలాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన చేసింది. మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతాం. గ్రావిటీ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు చేస్తున్నాం. మా ప్రభుత్వంలో ఈ నిర్మాణం పూర్తి చేస్తాం. పెద్దవాగు ప్రాజెక్టు అంతరాష్ట్ర ప్రాజెక్టు. దాని ఆయకట్టంతా ఏపీలోనే ఉంది. దానికి మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment