సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థి తులు ఉత్పన్నం కాలేదన్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు ఈవీఎంలు మొరాయించడంతో వాటి స్థానంలో వేరే ఈవీఎంలను వినియోగించామని, మూడు వీవీ ప్యాట్లు పనిచేయకపోవ డంతో మార్చామని తెలిపారు. మార్చిన ఈవీఎంలలోని ఓట్లను సైతం లెక్కిస్తామని చెప్పారు.
సూక్ష్మ పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్
6న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కిస్తారని సీఈఓ తెలిపారు. నల్లగొండ పట్టణంలోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాములో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను సిబ్బంది గురువారం రాత్రిలోగా అక్కడికి చేర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, సూక్ష్మ పరిశీలకుల సమక్షంలో ఈ ప్రక్రియ జరగనుందన్నారు.
రూ.8.27 కోట్ల నగదు స్వాధీనం..
ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.8.27 కోట్ల నగదు, చీరలు, ఇతర సామాగ్రితో పాటు 3.49 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ 599 దాడులు జరిపిందని, మొత్తం 6,100 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు 191 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. నియోజకవర్గంలో బయటి వ్యక్తులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 98 ఫిర్యాదులు వచ్చాయని, వారిలో 70 మందిని గుర్తించి బయటికి పంపించినట్టు తెలిపారు. బయటి వ్యక్తులను పట్టుకునేందుకు విస్తృత తనిఖీలు నిర్వహించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment