సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇవాళ (గురువారం) ప్రారంభమైంది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఓటర్ల జాబితాను తమకు సమర్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రచనా రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని వాదించారు. ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాల లో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని ఆమె వాదించారు.
ఇక.. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటున్నారు. జనవరి 2021 వరకు రెండు లక్షల 22 వేలు ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం లో 2 లక్షల 38 వేలు ఓట్లు ఉన్నాయి. 25వేల ఓట్లలో ఏడు వేలు తొలగించాం. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది’ అని వాదించారు.
రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులు ఎలా వచ్చాయని ఈసీని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వివరాలు, ఓటర్ల జాబితా తమకు సమర్పించాలని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment