
చెత్తా చెదారంతో దుర్గంధం
భారీ వర్షానికి మూసీ పరవళ్లు
భూదాన్‌పోచంపల్లి: మూసీ కాలుష్య కాసారంగా మారింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి వరద దిగువకు వచ్చి మూసీలో చేరుతోంది. దీంతో మంగళవారం మూసీ నది పరవళ్లు తొక్కింది. అయితే జంటనగరాల్లోని మురుగు, కాలుష్యం, చెత్తాచెదారం, గుర్రపుడెక్క ఆకు అంతా మూసీలోకి వచ్చి చేరడంతో.. దుర్గంధం వెదజల్లుతూ ప్రవాహం సాగుతోంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి, జూలూరు. పెద్దరావులపల్లి వద్ద నల్లటి మూసీ నది నీరు దుర్వాసన వెదజల్లుతూ చెత్తాచెదారంతో ప్రవహించింది. కాగా జూలూరు వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్రవహించడంతో.. ఈ మార్గంలో బీబీనగర్, భువనగిరికి రాకపోకలు నిలిచిపోయాయి.
మూసీ ప్రవహిస్తున్న విషయం తెలియక.. ఇబ్రహీంపట్నం నుంచి పోచంపల్లి మీదుగా భువనగిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు మూసీనది వరకు వచ్చి తిరిగి వెనక్కి వెళ్లి పెద్దరావులపల్లి మీదుగా భువనగిరికి చేరింది. అయితే మూసీ ఉధృతి కొనసాగుతుండటంతో ఈ మార్గంలో వాహనాలు వెళ్లకుండా అధికారులు మూసీకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.