లియో... ద రోబో డ్రోన్‌ | New Bipedal Drone Robot Can Walk Fly Skateboard And Slackline | Sakshi
Sakshi News home page

లియో... ద రోబో డ్రోన్‌

Published Sat, Oct 9 2021 1:52 AM | Last Updated on Sat, Oct 9 2021 1:52 AM

New Bipedal Drone Robot Can Walk Fly Skateboard And Slackline - Sakshi

ఎగిరే డ్రోన్స్‌ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్‌ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్‌ వచ్చేసింది. సెంటర్‌ ఫర్‌ అటానమస్‌సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (కాస్ట్‌) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్‌ పేరు లియోనార్డో... (లెగ్స్‌ ఆన్‌బోర్డ్‌ డ్రోన్‌). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్‌ తాడుపై నడవడమే కాదు... స్కేటింగ్‌ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్‌ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది.

రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్‌ మూవ్‌మెంట్‌ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్‌ ఆపరేటింగ్‌ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్‌ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద నడుస్తూ తమ అవసరాలకనుగుణంగా కదిలే పక్షులే మాకు స్ఫూర్తి. ఎగిరే డ్రోన్లకు కొన్ని పరిమితులున్నాయి. విద్యుత్‌ వినియోగం ఎక్కువ. కానీ లియో అలా కాదు.

పరిస్థితులకు అనుగుణంగా దాని మోడ్‌ను మార్చుకుంటుంది. జెట్‌సూట్‌ వేసుకున్న మనిషి భూమి మీద వాలేప్పుడు, ఎగరడానికి ముందు కాళ్లను నియంత్రించినట్టుగానే ఈ రోబో డ్రోన్‌ సైతం నియంత్రిస్తుంది. హై వోల్టేజ్‌ లైన్ల తనిఖీ, అంతరిక్ష కేంద్రంలోని వివిధ భాగాల మరమ్మతుల వంటివి చాలా ప్రమాదంతో కూడుకున్నవి.

అలాంటి వాటిని సైతం లియో ఒక్కటే చేసేస్తుంది’’అని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ సూన్‌ జో చుంగ్‌ తెలిపారు. అయితే మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దాని ధర ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇంకా పయ్రోగ స్థాయిలో ఉన్న ఈ రోబో... తయారీ కోసం ఏదైనా కంపెనీ ముందుకొస్తే త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement