చదువు చెప్పే గురువులేరి? | Nirmal: Basar IIIT Students Protest Outside Administrative Office Over Problems In University | Sakshi
Sakshi News home page

చదువు చెప్పే గురువులేరి?

Published Wed, Jun 15 2022 3:00 AM | Last Updated on Wed, Jun 15 2022 8:16 AM

Nirmal: Basar IIIT Students Protest Outside Administrative Office Over Problems In University - Sakshi

బాసర ట్రిపుల్‌ఐటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు  

నిర్మల్‌/బాసర: ‘మాకు పురుగులతో కూడిన అన్నం పెట్టినా తింటాం..కానీ..చదువు చెప్పేందుకు అధ్యాపకులు లేకపోతే ఎలా? ఓ వైపు విద్యార్థుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం.. అదే లెక్కన అధ్యాపకుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? మా వర్సిటీకి రెగ్యులర్‌ వీసీ.. అది కూడా క్యాంపస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదా? ప్రఖ్యాత క్యాంపస్‌లతో వర్సిటీని ఎప్పుడు అనుసంధానిస్తారు?

ఇలాంటివి.. ఎన్నో సమస్యలున్నాయ్‌. వీటిపై మంత్రులు, ఇన్‌చార్జి వీసీ, కలెక్టర్లతో సహా అధికార, ప్రతిపక్ష నేతలందరినీ కలిశాం. ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. తొమ్మిది వేల మంది వరకు ఉండే వర్సిటీ ఎవరికీ పట్టడం లేదు. అందుకే ఆందోళన చేపట్టాం..’అని నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు వెల్లడించారు.  

మూకుమ్మడి నిరసన 
మంగళవారం ఉదయం విద్యార్థులంతా ఒక్కసారిగా నిరసనకు దిగారు. క్యాంపస్‌లోని పరిపాలన భవనం ఎదుట ఎండలో బైఠాయించి, రోజంతా ఆందోళన కొనసాగించారు. తొమ్మిది వేలమంది ఉండే వర్సిటీలో వేలమంది విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ప్రాంగణమంతా వారి నినాదాలతో మార్మోగింది. అయితే విద్యార్థులను బయటకు రాకుండా.. వారి గోడును బయట ఉన్న తల్లి దండ్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియాకు వినిపించనివ్వకుండా పోలీసులు  మోహరించారు.

ఆ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌  నిలిపివేశారు. దీంతో ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది. ఎట్టకేలకు కొంతమంది విద్యార్థులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవోకు తమ గోడును, డిమాండ్లను తెలియజేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు దీనిపై స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రవీణ్‌కుమార్‌ మద్దతు 
ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారనే విషయం తెలియగానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్విట్టర్‌లో స్పందించారు. సమస్యల పరిష్కారానికి  పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలుస్తామన్నారు. నిర్మల్‌ జిల్లాకు చెందిన బీఎస్పీ నాయకులు వర్సిటీలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.  

నేడూ కొనసాగనున్న ఆందోళన! 
గత కొన్నేళ్లుగా వర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు. దీంతో వర్సిటీలో సమస్యలు, విద్యార్థుల పరిస్థితి, అవినీతి అక్రమాలూ.. ఏవీ బయటకు తెలియడం లేదు. వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా రాహుల్‌ బొజ్జా ఉన్నా.. ఇన్నేళ్లలో కేవలం ఒక్కసారి అది కూడా సగం పూట మాత్రమే వర్సిటీకి వచ్చి వెళ్లారని విద్యార్థులు తెలిపారు.  రాత్రి ఏడున్నర సమయంలో ఆందోళన విరమించిన విద్యార్థులు బుధవారం నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. 

గోడదూకి వెళ్లిన బల్మూరి 
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ పోలీసుల కళ్లుగప్పి క్యాంపస్‌లోకి వెళ్లారు. వర్సిటీ వరకు సాధారణ యువకుడిలా బైక్‌పై వచ్చి, రెండోగేట్‌ వద్ద గోడ ఎక్కి లోపలికి దూకారు. విద్యార్థుల వద్దకు వెంకట్‌ చేరుకున్న విషయం తెలియగానే పోలీసులు వెళ్లి అరెస్టు చేసి, ముధోల్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. 

విద్యార్థుల డిమాండ్లివే.. 
ళీ సీఎం కేసీఆర్‌ వర్సిటీని సందర్శించాలి. ళీ రెగ్యులర్‌ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి. ళీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి. ళీ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి. ళీ ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి. ళీ తరగతి, హాస్టల్‌ గదులకు మరమ్మతులు చేయాలి. ళీ ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి. ళీ మెస్‌ల మెయింటెనెన్స్‌ మెరుగ్గా ఉండేలా చూడాలి. ళీ పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement