హైకోర్టుకు తెలియజేసిన పోలీసులు
రోహిత్ ఎస్సీ కాదని, అందుకు ఆధారాలు లేవని వెల్లడి
ఈ కేసులో దాఖలైన పిటిషన్ల విచారణను ముగించిన హైకోర్టు
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, మాజీ ఎంపీ బి.దత్తాత్రేయతో పాటు పలువురికి ఉపశమనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది.
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో తనపై దాఖలైన ఎఫ్‌ఐ ఆర్‌ను రద్దు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వర్సిటీ వైస్ చాన్సిలర్ అప్పారావుతో పాటు పలు కారణాలతో మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం తీర్పు వెలువరించా రు. ట్రయల్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణన లోకి తీసుకుని ఇక్కడి పిటిషన్లలో విచారణ ముగిస్తున్నట్లు చెప్పారు.
సస్పెండ్ చేయడంతోనే ఆత్మహత్య
రోహిత్ వేములను సస్పెండ్ చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ట్రయల్ కోర్టులో పోలీసులు రిపోర్టు దాఖలు చేశారు. రోహిత్ మృతిపై నిరసనలు వెల్లువెత్తడంతో గచ్చిబౌలి స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశామని అతనిది హత్య అనేందుకు ఎలాంటి సాక్ష్యాధారాల్లేవని, కనుక కేసును మూసివేయాలని భావిస్తున్నామని అందులో పేర్కొన్నారు. రోహిత్ వేముల కుటుంబానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, అతడు దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని అందులో తెలిపారు.
దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు: హైకోర్టు
పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. దీంతో.. ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలకు ఈ కేసు నుంచి ఉపశమనం దొరికినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment