సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఉద్ధృతి దృష్ట్యా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టారు. కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు, వాటి ఫలితాలు వెలువడే వరకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉండేలా నిబంధనలను కఠినతరం చేశారు. కొద్ది రోజులుగా ఒమిక్రాన్ కేసుల నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కోవిడ్ పరీక్ష ఫలితాలు వెలువడకుండానే కోల్‌కతాకు వెళ్లిపోయాడు. అనంతరం అతనికి కోవిడ్ పాజిటివ్ అని తెలియడంతో అధికారులు గందరగోళంలో పడిపోయారు.
ఈ ఉదంతం నేపథ్యంలో పరీక్షలు సమర్థంగా నిర్వహించడంతో పాటు ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. విమానాశ్రయంలో ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్‌తో పాటు, ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టుల ఫలితాలు వెంటనే వచ్చేందుకు ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ నిర్వహిస్తున్నారు. ఈ టెస్టు ధర ప్రస్తుతం రూ.3,900 నుంచి రూ.3,400 తగ్గించినట్లు అధికారులు తెలిపారు. (విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి)
పరీక్షల సంఖ్య పెంపు..
► అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహించే కోవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచారు. ఇటీవల వరకు రాండమ్‌గా 2 శాతం మంది ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా ఇప్పుడు ఆ సంఖ్యను 5 శాతానికి పెంచారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు బ్రిటన్, అమెరికా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు ఉద్ధృతి కొనసాగుతున్న దృష్ట్యా ఎయిర్‌పోర్టులో టెస్టుల సంఖ్యను పెంచారు. 2 శాతం నుంచి 5 శాతం మంది ప్రయాణికులకు రాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
► పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని టిమ్స్‌కు తరలించేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారు వారం పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ ముప్పు ఉన్నట్లు గుర్తించిన దేశాల సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. బ్రిటన్, దక్షిణకొరియా, బ్రెజిల్, బోట్సువానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయిల్ దేశాలను హైరిస్క్ దేశాలుగా పరిగణిస్తున్నారు.
14 మంది హోటల్ సిబ్బందికి వైద్య పరీక్షలు
సొమాలియాకు చెందిన (66)ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకి ఉండొచ్చనే అనుమానంతో ఆయన బస చేసిన హోటల్ 14 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఒమిక్రాన్ అనుమానిత బాధితున్ని టిమ్స్‌కు తరలించకుండా గాంధీలో అడ్మిట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది సహా సాధారణ రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు ఆందోళన చెందుతున్నారు.
తగ్గిన ప్రయాణికుల రద్దీ..
► ఒమిక్రాన్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు సగానికి పైగా తగ్గాయి. అత్యవసర ప్రయాణికులు మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నారు. ఒమిక్రాన్ కంటే ముందే హైదరాబాద్‌కు చేరుకున్నవారు తిరిగి బయలుదేరుతున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే వారిలో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో నగరానికి వస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
► వారం రోజుల క్రితం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 70 అంతర్జాతీయ విమాన సర్వీసులు రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 38కి పడిపోయింది. ప్రయాణికులు సైతం రోజుకు 3 వేల నుంచి 5 వేల వరకు ఉంటున్నారు. ఇటీవల వరకు రోజుకు సుమారు 8 వేల మంది ప్రయాణం చేసినట్లు అంచనా.
► దేశంలోని వివిధ నగరాల మధ్య డొమెస్టిక్ విమానాల రాకపోకలు యథావిధిగానే కొనసాగుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వారం రోజుల క్రితం 55 వేల మందికిపైగా రాకపోకలు సాగించగా ఇప్పుడు ఆ సంఖ్య 50 వేలకు పడిపోయింది.
విదేశీయుల కోసం ప్రత్యేక ఓపీ, ఐపీ
నగరంలోని అపోలో, కేర్, ఏఐజీ, విరించి, మెడికవర్, యశోద, కిమ్స్, సన్‌షైన్ తదితర కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ అనుమానిత విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఓపీ, ఐపీ వార్డులను ఏర్పాటు చేశారు. అంతేకాదు వీరికి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment