
చలో మొబిలిటీ, సోం డిస్టిలరీలపై హౌస్ కమిటీతో విచారణ చేయాలి
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సోం డిస్టిలరీకి..కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ ఆ సంస్థ నుంచి కాంగ్రెస్‌కు రూ.1.80 కోట్ల ఫండ్ అందినట్టు కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. మధ్యలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు.
ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, ఇక తెలంగాణలో తమ బ్రాండ్ల సరఫరాకు అనుమతి వచ్చినట్టు సోం బ్రేవరేజెస్ ప్రకటించిందని, కానీ ప్రభుత్వం మాత్రం తాము అనుమతి ఇవ్వలేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అయితే దీనిని క్యాన్సిల్ చేసినట్లు మంత్రి తెలిపారని, కానీ ఆ అనుమతి రద్దు చేయలేదని సెబీ నుంచి సమాధానం వచ్చినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రావడంతో సంబంధిత మంత్రికి తెలియకుండా ఇదంతా జరిగినట్టు తెలిపారు.
ఆఫ్‌లైన్‌లో సంస్థకు ఆర్టీసీ టెండర్
ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్‌ను ఆన్‌లైన్ టెండర్ వేయకుండా ఆఫ్‌లైన్ టెండర్ ద్వారా చలో మొబిలిటీ సంస్థకు అప్పగించారని కౌశిక్‌రెడ్డి తెలిపారు. టెండర్ పిలిచి రద్దు చేసినట్టు ప్రకటించిన ఆర్టీసీ.. ఆ తర్వాత మళ్లీ ఎలా ఆ సంస్థకు కట్టబెట్టిందని ప్రశ్నించారు. ఇక ఫెయిర్ కలెక్షన్‌పై తమ బృందం బిహార్, అస్సాం, ఇండోర్, జబల్‌పూర్‌కు స్టడీ టూర్‌కు వెళ్లినట్టు తెలిపిందన్నారు.
అయితే టూర్ ఆదేశాలకు, టెండర్ ఇవ్వడానికి మధ్య మూడు రోజులే గ్యాప్ ఉందని, ఈ మూడు రోజుల్లోనే నాలుగు రాష్ట్రాలు ఎలా తిరిగి వస్తారని ప్రశ్నించారు.ఆర్టీసీకి సంబంధించి చలో మొబిలిటీ సంస్థపై, ఎక్సైజ్ శాఖకు సంబంధించి సోం డిస్టిలరీ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని, వీటిపై విజిలెన్స్, సీబీఐ విచారణ జరిపించాలన్నారు.
ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను కౌశిక్‌రెడ్డి రెచ్చ గొడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వాలా వద్దా బీఆర్‌ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్కకు నాలెడ్జ్ లేదని ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేస్తూ, తనకు దురహంకార నాలెడ్జ్ లేదని, ఓట్ల కోసం చస్తా అన్న నాలెడ్జ్ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment