సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్: కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కే గడియ రానే వచ్చింది. 2015లోనే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అంకురార్పణ జరగ్గా, దాదాపు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ కల సాకారం కానుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నార్లాపూర్ పంపుహౌస్, కృష్ణాతీరంలోని హెడ్‌రెగ్యులేటరీ ఇన్‌టేక్ వద్ద, కొల్లాపూర్ చుట్టుపక్కల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొల్లాపూర్‌కు రోడ్డు మార్గంలో వస్తారు. మొదటగా నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పంప్‌హౌస్‌లోని కంట్రోల్ రూం వద్ద పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరిస్తారు.
పంపుహౌస్‌లోని నాలుగో అంతస్తులో మొదటి మోటారు స్విచ్ ఆన్‌చేసి నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 1.7 కి.మీ దూరంలో ఉన్న హెడ్ రెగ్యులేటరీ వద్దకు చేరుకొని కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం కొల్లాపూర్ పట్టణ శివారులోని సింగోటం చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
కొల్లాపూర్‌లో సీఎం సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి వేర్వేరుగా పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం అందుబాటులో ఉండాలని, శుక్రవారం రాత్రి వరకు ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు.అంతకుముందు మంత్రి నిరంజన్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను పరిశీలించారు. స్విచ్ బోర్డుల పనితీరు గురించి నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి మంత్రికి వివరించారు.
మహా బాహుబలి మోటార్లు
♦ పాలమూరు ఎత్తిపోతల్లో మొత్తం 34 మోటార్లు వినియోగిస్తున్నారు. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇంత సామర్థ్యం గల మోటార్లు ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ప్రథమం. ఈ మోటార్లను మహా బాహుబలి పంప్‌లుగా పిలుస్తున్నారు.
♦ఏదుల పంప్‌హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ సర్జిపూల్‌ను భూ ఉపరితలం నుంచి 145 మీటర్ల లోతులో నిర్మించారు. 90 మీటర్ల ఎత్తు, 357 మీటర్ల పొడవు, 31 మీటర్ల వెడల్పుతో దీని డిజైన్ రూపొందించారు.
♦పాలమూరు ఎత్తిపోతల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లను భూ ఉపరితలంపైనే నిర్మించారు. పంపులు, విద్యుత్ వ్యవస్థతోపాటు అన్నింటా మానవరహిత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కాడా (సాంకేతిక వ్యవస్థ) వినియోగిస్తున్నారు. 550 టన్నుల బరువు ఉండే పంప్ నడుస్తున్నప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ మేరకు చల్లబరిచేందుకు కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మోటారుకు 20 భారీ ఏసీలు అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment