సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను అంచనా వేస్తూ ధరలను ప్రతిరోజూ సవరిస్తున్న ఆయిల్ కంపెనీలు నాలుగు రోజుల నుంచి ధరలను పెంచేస్తున్నాయి. శుక్రవారం సైతం పెట్రోల్ ధర లీటర్‌పై 30 పైసలు, డీజిల్‌పై 39 పైసల మేర పెరిగింది. నిజానికి గడిచిన సోమవారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రల్ ధర రూ.90.42 ఉండగా, మంగళవారం 36 పైసలు పెరిగింది. అప్పటినుంచి రోజూ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ధర 91.65కి చేరింది. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్ ధర రూ.1.23 మేర పెరిగింది. ఇక ఈ నెల ఒకటవ తారీఖు ధరలతో పోలిస్తే ఆయిల్ కంపెనీలు వాహనదా రులపై ఏకంగా రూ.1.88 మేర బాదేశాయి.
ఈ నాలుగు రోజుల వ్యవధిలో డీజిల్ ధర సైతం రూ.1.36 మేర పెరిగి లీటర్ రూ.85.50కి చేరింది. ఫిబ్రవరి ఒకటిన ఉన్న ధరలతో పోలిస్తే 2.04 మేర పెరిగింది. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 15 కోట్ల లీటర్ల పెట్రోల్, 21 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ లెక్కన 12 రోజుల్లోనే రాష్ట్రంలోని వాహనదారులపై కనీసంగా రూ.30 కోట్ల మేర భారం పడింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతున్నాయని సంకేతాలు వస్తున్నా, ఆయిల్ కంపెనీలు మాత్రం ధరల పెంపునకే మొగ్గుచూపుతుండటంతో మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌లో లీటర్ ధరలు రూ.100 కొట్టొచ్చనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment