
వరంగల్ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
అభివృద్ధి కోసం, వివిధ రంగాల్లో పురోగతి కోసం దేశాల మధ్యనో, రాష్ట్రాల మధ్యనో ఒప్పందాలు కుదరడం సహజం. కానీ రెండు రాజకీయ పార్టీలు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి డీల్ కుదుర్చుకోవడం దుర్మార్గం. బీఆర్‌ఎస్ సర్కార్ అవినీతి ఢిల్లీ దాకా వ్యాపించింది. ఇలాంటి అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. వరంగల్‌సభ విజయవంతంతో హైదరాబాద్‌లోని ఓ కుటుంబానికి నిద్ర కరువైనట్టే.
– ప్రధాని మోదీ
తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన మోదీ
సభలో ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘భారత్ మాతా కీ జై.. జై భద్రకాళి మాతా.. అమ్మవారి మహాత్మ్యానికి, సమ్మక్క – సారలమ్మ పౌరుషానికి, రాణీరుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాంచిన వరంగల్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. తర్వాత హిందీలో మాట్లాడారు.
వరంగల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్‌దేనని, ఈ అవినీతి ఢిల్లీ దాకా చేరిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిప్రాజెక్టులోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. అవన్నీ బట్టబయలు అవుతాయని పేర్కొన్నారు. ఇలాంటి అవి నీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని చెప్పారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికోసం వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు, పనులు చేసి, పూర్తి సహాయ సహకారాలు అందిస్తే.. కేసీఆర్ సర్కారుకు మాత్రం పొద్దస్తమానం మోదీని, కేంద్రప్రభుత్వాన్ని తిట్టడమే సరిపోయిందని విమర్శించారు.
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏదోలా మభ్యపెట్టి మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారాయని వ్యాఖ్యానించారు. శనివారం వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో మోదీ మాట్లా డారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..
చదవండి: Narendra Modi: దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలకం: ప్రధాని మోదీ
‘‘తెలంగాణలో ఒక్క కుటుంబమే అధికార కేంద్రంగా మారింది. తనకు తాను తెలంగాణకు యా జమాని అనుకుంటోంది. ఇలా కుటుంబ పార్టీల పాలనలో తెలంగాణ కూరుకుపోతుందని ప్రజలు ఏనాడూ అనుకోలేదు. దేశవ్యాప్తంగా కుటుంబ పార్టీల డీఎన్‌ఏ మొత్తం అవినీతిమయమే. వారికి పరివారం, కుటుంబసభ్యులు, పిల్లల భవిష్యత్ తప్ప ప్రజల జీవితాలను మార్చాలని ఉండదు.
కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడితే.. బీఆర్‌ఎస్ తెలంగాణలో అలాంటి పనితో భ్రష్టు పట్టించింది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను ధోకా చేసింది. ప్రజల నమ్మకాన్ని ముక్కలు చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో నిరుద్యోగ యువత, రైతులు, ఇతర వర్గాలకు తీరని నష్టం జరిగింది.
మేం చెప్పినవన్నీ చేశాం: బీజేపీ ప్రభుత్వం చెప్పినవన్నీ చేసింది. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వనివీ నెరవేర్చింది. పేదలకు ఉచిత రేషన్, ఆయుష్మాన్‌భారత్ కింద రూ.5 లక్షల దాకా వైద్య సాయం, ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం, నల్లాల ద్వారా తాగునీటి సరఫరా వంటివి చేపట్టాం. 2014కు పూర్వంతో పోలి్చతే తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ 17 రెట్లు పెరిగింది. దీనికి పూర్తి భిన్నంగా బీఆర్‌ఎస్ సర్కార్ అన్నింటా విఫలమైంది.
దళితులు, బలహీన వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది. గిరిజనులు, ఆదివాసీలను అభివృద్ధికి దూరం పెడుతోంది. రోడ్లు, తాగునీరు, స్కూళ్లు, ఆస్పత్రులు వంటి వాటిలో చివరి ప్రాధాన్యతగానే గిరిజనులను చూస్తున్నారు. దీనిని దూరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. వారికి రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. ‘సికిల్ సెల్ ఎనీమియా’ వ్యాధితో బాధపడుతున్న గిరిజనులను ఆదుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఈ వ్యాధిని వేళ్ల నుంచి పెకలించేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది.
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..
అబ్‌కీ బార్ బీజేపీ సర్కార్.. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఓడించి బీజేపీ అధికారంలోకి రాబోతోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో తెలంగాణ కీలకపాత్ర పోషించబోతోంది. వరంగల్ మాకు జనసంఘ్ రోజుల నుంచీ సైద్ధాంతిక భూమికగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి రెండే ఎంపీ సీట్లున్నపుడు.. అందులో ఒకదానిని చందుపట్ల జంగారెడ్డి ఇక్కడి నుంచే గెలిచారు.
ఇప్పుడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయపార్టీగా ఎదిగింది. ఇందులో తెలంగాణ భూమిక కూడా ఉంది. 2021లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచి ట్రైలర్ చూపించింది. అదొక స్పష్టమైన సంకేతం. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఓడించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోబోతోంది.
తెలంగాణ అభివృద్ధే లక్ష్యం
దేశం ఆత్మనిర్భర్‌గా నిలవడంలో తెలంగాణ కూడా భాగస్వామి. దేశాభివృద్ధిలో చాలా కీలకం. తెలంగాణ అభివృద్ధే బీజేపీ లక్ష్యం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని నూతన హంగులతో మొదలుపెట్టాం. కాజీపేట ఫ్యాక్టరీలో తయారయ్యే రైల్వే వ్యాగన్లను దేశవ్యాప్తంగా ఉపయోగించనున్నాం. కోవిడ్ సమయంలో తెలంగాణ పోషించిన పాత్ర మరువలేనిది. వ్యాక్సిన్ల తయారీలో ముందు నిలిచి ప్రపంచాన్ని ఆదుకుంది. మేకిన్ ఇండియాకు తెలంగాణ తయారీదారులు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. దేశంలో ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తుంటే.. అందులో ఒకటి తెలంగాణలో ఉంది..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కారు వైఫల్యాల చిట్టా ఇదీ..
‘‘తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ సర్కారు ప్రజలను మోసం చేస్తూనే ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్దపెద్ద మాటలు చెప్పారు. ఎన్నో ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. టీఎస్‌పీఎస్సీ స్కామ్ గురించి అందరికీ తెలుసు. తెలంగాణలోని 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను తొక్కిపెట్టారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అణచివేస్తున్నారు. వర్సిటీల్లో 3వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
స్కూళ్లలో 15 వేల టీచర్ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశా రు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. మోసం చేశారు. రైతులకు లక్షరుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులు ఇస్తున్నా.. బీఆర్‌ఎస్ సర్కారు వాటిని నిరీ్వర్యం చేసింది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడంలో సర్పంచులు ముందు వరుసలో నిలవనున్నారు.’’
Comments
Please login to add a commentAdd a comment