బాధితురాలు పట్లోళ్ల శివమ్మ, సస్పెండైన తహసీల్దార్ రాజయ్య
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయికోడ్: బతికుండగానే మరణించినట్లు చూపి 27.34 ఎకరాల భూమిని వేరొకరి పేర పట్టా చేసిన వ్యవహారంలో రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య సస్పెండ్ అయ్యారు. ఈ భూమిపై క్రయవిక్రయాలు అసలైన పట్టాదారులకు కనిపించకుండా ధరణి వెబ్‌సైట్‌లో ప్రత్యేక సౌకర్యం ఉన్న ప్రైవసీ మోడ్‌లో పెట్టినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇలా ప్రైవసీ మోడ్‌లో పెడితే సదరు భూమిపై ఎలాంటి క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరిగినా ధరణిలో కనిపించవు.
అసలు ఉదంతమిదీ..
రాయికోడ్ మండలం నాగన్‌పల్లికి చెందిన పట్లోళ్ల హన్మంత్‌రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్ 198లో 27.34 ఎకరాల భూమి ఉంది. హన్మంత్‌రెడ్డి గతేడాది మరణించడంతో ఆ భూమిని ఆయన భార్య శివమ్మ సక్సేషన్ (వారసత్వం కింద) పట్టా చేయించుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో కుమారుల వద్ద ఉంటున్నారు. అయితే శివమ్మ కూడా మరణించిందని రికార్డుల్లో చూపిన తహసీల్దార్ రాజ య్య ఆ భూమిని ఈనెల 19న అంజమ్మ పేర మార్చారు.
లావాదేవీలు ధరణి వెబ్‌సైట్‌లో కనిపించకుండా ప్రైవసీ మోడ్‌లో పెట్టారు. అనుమానం వచ్చిన శివమ్మ కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి ఆరాతీయగా తన తల్లి పేరుతో ఉన్న భూమిని మరొకరి పేర మార్చారని చేసిన ట్లు తేలింది. దీంతో ఆయన కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు గురువారం విచారణ చేపట్టగా రాజయ్య బాగోతం బయటపడింది. ఆర్డీవో నివేదిక మేరకు కలెక్టర్.. తహసీల్దార్ రాజయ్యతోపాటు, ఆర్‌ఐ శ్రీకాంత్‌ను సస్పెండ్‌చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మూడు నెలల క్రితం స్లాట్ బుకింగ్...
పట్టా మార్పిడికి 3 నెలల క్రితమే స్లాట్ బుక్‌చేయడం గమనార్హం. సాధారణంగా స్లాట్ బుక్‌చేసిన నిర్ణీత వ్యవధిలోనే పట్టా మార్పిడి చేయాలి. అయితే తహసీల్దార్ మూడు నెలల అనంతరం పట్టా మార్పిడి చేశారు. ఈ వ్యవహారంలో రూ.40 లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ ఆర్‌ఐగా పనిచేసిన శ్రీకాంత్.. అసలైన పట్టాదారు శివమ్మకు వారసురాలు అంజమ్మనే అంటూ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం మెదక్ జిల్లాలో పనిచేస్తున్న శ్రీకాంత్‌పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. భూమి పౌతీమార్పు వ్యవహారంలో నకిలీ ధ్రువపత్రాలను వినియోగించిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు రాయికోడ్ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు. శివమ్మ ఫిర్యాదు మేరకు.. ఆమె వియ్యంకురాలు అంజమ్మ, ఆమె కుమారుడు అమృత్‌రెడ్డి, మనవడు రాజశేఖర్‌రెడ్డి, భూ బదలాయింపులో సాక్షులుగా ఉన్న టి.మల్లేశం, బి.నర్సింలుపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment