డ్రగ్స్‌పై సిట్‌ వేయండి | Revanth Reddy Letter To KCR Over CIT On Drugs Issue | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌పై సిట్‌ వేయండి

Published Sat, Apr 2 2022 3:34 AM | Last Updated on Sat, Apr 2 2022 9:52 AM

Revanth Reddy Letter To KCR Over CIT On Drugs Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో 23 ఏళ్ల ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ డ్రగ్స్‌ భూతానికి బలవడం తెలంగాణ సమాజాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోవా నుంచి హైదరాబాద్‌ డ్రగ్‌ కారిడార్‌లా, హైదరాబాద్‌ డ్రగ్స్‌కు కేంద్రంగా వర్ధిల్లుతోందన్న అభిప్రాయం కలుగుతోందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో వెంటనే జాతీయస్థాయిలో ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జరుపుతున్న విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రేవంత్‌ శుక్రవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు.

ఆ లేఖలోని వివరాలు రేవంత్‌ మాటల్లోనే.. 
‘‘మొన్న కెల్విన్, నిన్న టోనీ లాంటి డ్రగ్‌ మాఫియా పెడ్లర్లు చాపకింద నీరులా హైదరాబాద్‌ను డ్రగ్స్‌ వినియోగ కేంద్రంగా మార్చుతున్న తీరుపై ఐదేళ్లుగా మేం మొత్తుకుంటున్నా.. ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. డ్రగ్స్‌ కేసుల్లో ప్రమేయమున్న రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులను కాపాడేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్ని స్తోందన్న విమర్శలు ఉన్నాయి.

ఎన్ని టాస్క్‌ఫోర్సు లు వేసినా డ్రగ్స్‌ మాఫియా అంతం కాకపోవడానికి తెర వెనుక మీ ప్రభుత్వం చేస్తోన్న చేష్టలే కారణంగా కనిపిస్తోంది. ఈడీ మీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎవరిని కాపాడాలనే ఉద్దేశంతో మీరు ఈడీకి సహకరించడం లేదు? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత కూడా.. కేసులో తీవ్రత ఎందుకు అర్థం కావడం లేదు? 

రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? 
65 ఏళ్ల ఉమ్మడి పాలనలో హైదరాబాద్‌లో మొత్తం ఆరు పబ్‌లకు అనుమతిస్తే.. టీఆర్‌ఎస్‌ అధికా రంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో 60కి చేరాయి. హైదరాబాద్‌ శివార్లలో మూతబడ్డ పలు ఫార్మా కంపెనీలు డ్రగ్స్‌ తయారీ కేంద్రాలుగా మారాయి. ఇవన్నీ చూస్తుంటే మీరు రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకెళుతున్నారో అర్థం కావడం లేదు. యువత చైతన్యంగా ఉంటే ఉద్యోగాలు, ఉపాధి అడుగుతారనే ఉద్దేశంతో డ్రగ్స్‌కు బానిసలను చేయాలన్న సంకుచిత బుద్ధి ఉందా? డ్రగ్స్‌ బాధిత మరణంతోౖ నెనా ప్రభు త్వం బుద్ధి మార్చుకోవాలి. తక్షణమే డిజిటల్‌ రికార్డులన్నీ ఈడీకి అందజేయాలి. కేసు విచారణ కోసం జాతీయ స్థాయి సిట్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఈడీలకు ప్రధానికి లేఖ రాయాలి. లేకుంటే డ్రగ్స్‌ విషయం లో రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా భావించాల్సి ఉంటుంది..’’అని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  

మీ ఎమ్మెల్యేలను కాపాడుతున్నారా? 
బెంగళూరులో నమోదైన డ్రగ్స్‌ కేసులో మీ పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి కదా. వారిని మీ ప్రభుత్వమే కాపాడినట్టు ఆరోపణలు వస్తుం టే మీరెందుకు స్పందించరు? 2017లో సినీ ప్రముఖుల విచారణ తర్వాత అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆకస్మిక బదిలీ వెనుక ఏం జరిగింది? రాజకీయ, సినీ ప్రముఖులను కాపాడటంపై ఉన్న శ్రద్ధ డ్రగ్స్‌ను నియంత్రించడంపై ఎందుకు ఉండటం లేదు? ఈ ఏడాది జనవరి 20న అరెస్టయిన టోనీ నుంచి నగరానికి చెందిన పారిశ్రామికవేత్తలు రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు విచా రణలో తేలిన విషయం మర్చిపోయారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement