
సాక్షి, హైదరాబాద్: మోదీ అధికారంలో ఉంటే ద్రవ్యోల్బణం ఉంటుందని.. మోదీ, ద్రవ్యోల్బణం దేశానికి హానికరమని ఏఐసీసీ అధికార ప్రతినిధి మోహన్ ప్రకాశ్ పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో ఈ దేశానికి మోదీ ఇచ్చిన మొదటి బహుమతి 14.23% ద్రవ్యోల్బణమని ఎద్దేవా చేశారు. శనివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ద్రవ్యోల్బణం గత పదేళ్ల కంటే గరిష్ట స్థాయికి చేరిం దని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న అస్తవ్యస్త ఆర్థిక విధానాలే ఇందుకు కారణమన్నారు. ఐదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు ఉన్న కారణంగానే వస్త్రాలపై జీఎస్టీ పెంపును వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నేతలు బి. మహేశ్‌కుమార్‌గౌడ్, ఎం.ఆర్.జి. వినోద్‌రెడ్డి, దాసోజు శ్రావణ్, జి. చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి పాల్గొన్నారు.