క్యాంపస్ నియామకాలకు కష్టకాలమే
ఫ్రెషర్స్‌లో తగ్గిన నైపుణ్యాలు.. చాట్ జీపీటీ మీదే ఆధారం
జాతీయ పరిశ్రమల అంచనా.. స్కిల్ ఇండియా నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ నియామకాల్లో ఐటీ ఉద్యోగం సంపాదించాలనేది దాదాపు అందరు విద్యార్థుల కోరిక. కానీ 2025లో క్యాంపస్ నియామకాలు అరకొరగానే ఉంటాయని స్కిల్ ఇండియా రిపోర్ట్–2025 అంచనా వేసింది. ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఐటీ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. సంస్థలు గతంలో కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుని, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఈ రిపోర్ట్‌స్పష్టం చేసింది.
కృత్రిమ మేధ సాంకేతికత వినియోగంవైపు కంపెనీలు మొగ్గుచూపటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లకే ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. 2025లో 33 శాతం కంపెనీలు ఏఐ టెక్నాలజీపై పట్టున్న నిపుణులనే ఉద్యోగాల్లోకి తీసుకొంటాయని అంచనా వేశారు. ఐటీ రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి మంచి అవకాశాలుంటాయని నివేదికలో పేర్కొన్నారు.
ఫ్రెషర్స్‌లో నైపుణ్యం కొరత
కొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులను ఏ ప్రశ్న వేసినా.. చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తున్నారని ప్రధాన కంపెనీలు పేర్కొంటున్నాయి. స్వతహాగా ఆలోచించే శక్తి వారిలో కన్పించడం లేదని అంటున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య, పలు యూనివర్సిటీలు, ప్రముఖ ఐటీ కంపెనీలు కలిసి నూతన ఇంజనీరింగ్ పట్టభద్రుల నైపుణ్యాలను పరీక్షించాయి. 86 శాతం విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం అవసరాలకు తగ్గట్టుగా లేదని గుర్తించాయి. 2025లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు 14 శాతానికి మించి ఉండకపోవచ్చని అంచనా వేశాయి. ఇంజనీరింగ్ సిలబస్‌లో ప్రస్తుత తరానికి పనికివచ్చే అంశాలు ఉండటం లేదని నిపుణులు గుర్తించారు. వీరికన్నా ఏఐ టెక్నాలజీ పది రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుందని పలు సంస్థలు అంటున్నాయి. అయితే, ఐటీ సంస్థల్లో ఫ్రెషర్స్‌కు అవకాశం వస్తే మాత్రం.. వారికి వేతనాలు భారీగానే ఉండొచ్చని నివేదిక వెల్లడించింది.
మెరుగు పెట్టేందుకు మండలి కృషి
ప్రాంగణ నియామకాలు తగ్గిపోయే పరిస్థితి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నైపుణ్య కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వారి స్కిల్స్‌ను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. జేఎన్‌టీయూహెచ్ ఇన్‌చార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ముందుగా ఆ వర్సిటీ నుంచే ఈ ప్రయోగం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉండటంతో ఇందుకు సంబంధించిన కొత్త కోర్సులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment