సాక్షి, హుజూర్‌నగర్(సూర్యాపేట): ఏడాది క్రితం తప్పిపోయిన పిల్లి మళ్లీ కనబడటంతో రెండు కుటుంబాల మధ్య తగాదాకు దారి తీసింది. పిల్లి తమదంటే తమదంటూ వారు వాగ్వాదానికి దిగి, పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఎస్‌ఐ చొరవతో సమస్య పరిష్కారమైంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని దద్దనాల చెరువు కాలనీలో నివసించే మద్దెల మున్నా, అతని తల్లి ముత్యాలు మూడేళ్ల క్రితం మైసూర్‌నుంచి పిల్లి పిల్లల జంటను రూ 5 వేలకు కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. వీటిలో ఆడపిల్లి బావిలోపడి చనిపోగా మగపిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది.
మున్నా, ముత్యాలు ఎంతవెతికినా ఫలితం లేకపోయింది. అయితే ఇటీవల ఫణిగిరి గుట్ట వద్ద ఓ వ్యక్తి ఆ పిల్లిని చూసి గుర్తుపట్టి మున్నాకు సమాచారమిచ్చాడు. దీంతో వారు పిల్లిని పెంచుకుంటున్న సుక్కమ్మ ఇంటికి వెళ్లి పిల్లి కోసం అడిగారు. ఈక్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. మున్నా, ముత్యాలుకు రూ 5 వేలను ప్రస్తుతం పిల్లిని సాదుకుంటున్న సుక్కమ్మ ఇచ్చేలా మాట్లాడి ఇరువర్గాలను ఎస్‌ఐ ఒప్పించారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది.
చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
Comments
Please login to add a commentAdd a comment