సాక్షి, నల్గొండ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలకు సేవ చేస్తానంటూ తన పదవికి రాజీనామా చేసి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8న బీఎస్పీలో చేరారు. అనంతరం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు.
మరోవైపు టీఆర్‌ఎస్ ఎమెల్యే గ్యాదరి కిషోర్, మరికొందరు అధికారం పార్టీ నేతలు సోమవారం .. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకోమని కౌంటర్ ఇచ్చారు. దీంతో తమ నాయకుడు ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్వేరోస్ సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే స్వేరోస్ సభ్యుడు సంపత్ అనే వ్యక్తి పేరుతో ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు ఫోన్ చేసిన సంపత్..‘నీది ప్రవీణ్ కుమార్‌ను విమర్శించే స్థాయా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి ప్రవీణ్ కుమార్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. ఏడేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దళిత బంధు గుర్తుకువచ్చిందా మీకు అని ప్రశ్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment