సాక్షి, హైదరాబాద్: తన శిష్యుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మూసేయడమే మంచిదనే అభిప్రాయంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు టీటీడీపీ వర్గాలే భావిస్తున్నాయి. ఏపీలో అధికారంలోకి వస్తున్నాం అనే మాటలే తప్ప ... తెలంగాణలో పార్టీకి అధ్యక్షుడిని నియమిద్దామనే మాట కూడా బాబు నోట వెలువడలేదు. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం తన నివాసంలో తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు.
తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకుంటారని భావించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన టీడీపీ అభిమానులకు నిరాశే ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు టీటీడీపీ అధ్యక్షుడిగా పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్‌ఎస్‌లో చేరగా, అప్పటి నుంచి తెలంగాణ పార్టీకి దిక్కూ దివాణా లేకుండా పోయింది.
పార్టీ రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నా..
ఎన్నికల్లో కనీసం పోటీ చేయకపోవడంతో ప్రాంతీయ పార్టీగా తెలంగాణలో గుర్తింపు కూడా రద్దయ్యే పరిస్థితి నెలకొంది. శాసనసభ ఎన్నికలలో తన శిష్యుడు రేవంత్‌రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించిన చంద్రబాబు పార్లమెంటు ఎన్నికల్లో కూడా అభ్యర్థులను పోటీకి పెట్టలేదు. ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్‌కు అండగా నిలవాలనే విధంగానే పార్టీ యంత్రాంగానికి ఉద్బోధ చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాలని, అదే రోజు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసి, ప్రభుత్వానికి మద్దతు తెలపాలని శుక్రవారం తనను కలిసిన పార్టీ వర్గాలకు హితబోధ చేశారు.
అక్కడ ఫలితాలొచ్చాక చూద్దాం..
ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పిన ఆయన అక్కడ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందనే ధీమాను కూడా పార్టీ యంత్రాంగం ముందు వ్యక్తం చేయకపోవడం నాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ 4 తరువాత వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో పార్టీ గురించి ఆలోచిస్తామని చంద్రబాబు పరోక్షంగా పార్టీ నాయకులకు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఫొటోలు దిగారు. సమావేశంలో పార్టీ నాయకులు బక్కని నర్సింములు, అర్వింద్ కుమార్ గౌడ్, కాట్రగడ్డ ప్రసూన, పి. సాయిబాబా, సాంబశివరావు, కోటేశ్వర్ రావు, నల్లెల్ల కిషోర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment