సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా జరిగిన ఉద్యోగుల కేటాయింపుల్లో భాగంగా తమను ఫలానా రాష్ట్రానికి కేటాయించాలంటూ ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్ హక్కు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. తాము కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలంటూ ఆప్షన్ ఇచ్చినంత మాత్రాన వారిని ఆ రాష్ట్రానికే కేటాయించాలని లేదని తేల్చిచెప్పింది. స్థానికత, సీనియారిటీ, ఆప్షన్ వీటన్నింటినీ పరిశీలించి కేటాయింపుల జాబితా రూపొందిస్తారని పేర్కొంది.
తనను తెలంగాణకు కేటాయించాలని కోరినా ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గాంధీ మెడికల్ కళాశాలకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మునగాల జ్యోతి దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. స్థానికత ఆధారంగా చట్టబద్ధంగానే ఈ కేటాయింపు జరిగిందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌చేస్తూ జ్యోతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.
(చదవండి: పేకాటలో ప్రజాప్రతినిధులు?)
Comments
Please login to add a commentAdd a comment