సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణకు ఉత్తమ పరీక్షగా వైద్యులు పేర్కొంటున్న ఆర్‌టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా ఉందో లేదో కూడా సరిగ్గా నిర్ధారిం చలేని ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల (ఆర్‌ఏకే)ను భారీగా చేస్తుండటంపై మండిపడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది రక్షణకు తగిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కరోనా పరీక్షల ధరలు తగ్గించా లంటూ దాఖలైన లేఖలను ధర్మాసనం గతంలో సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాలుగా విచారణకు స్వీకరించింది.
ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళ వారం మరోసారి విచారించింది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, కరోనా రెండో దశ వేగంగా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలను కబళిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మేల్కొనపోతే ఎలా అని ప్రశ్నిం చింది. భవన నిర్మాణ ప్రదేశాల్లో కార్మికులకు, అత్యంత రద్దీ ప్రదేశాల్లో ప్రజలకు మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రత్యేకంగా పరీక్షలు చేయించాలని తాము ఆదేశించినా నివేదికలో ఆ వివరాలను ఎందుకు పొందుపర్చలేదని ధర్మాసనం నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం అరకొర వివరాలతో అసమగ్రంగా నివేదిక సమర్పించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బార్లు, పబ్బులు, మద్యం దుకాణాల నియంత్రణ దిశగా రెండు రోజుల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తామే ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఎన్ని పరీక్షలు చేశారు?
కరోనా నిర్ధారణకు సంబంధించి ఎన్ని పరీక్షలు చేశారని ధర్మాసనం ఏజీ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించగా 9,11,611 పరీక్షలు చేశామని, అందులో 7,63,136 ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేశామని, 1,48,475 ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేశామని ఏజీ నివేదించారు. మొత్తం పరీక్షల్లో 10 శాతం ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు కూడా చేయట్లేదని, గత విచారణ సందర్భంగా ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలన్న తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రతి 10 లక్షల జనాభాకు చేస్తున్న పరీక్షల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని ఏజీ నివేదించగా మార్చి రెండో వారం నుంచి రెండో దశ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మేల్కొనపోతే ఎలా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 24 గంటలూ ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతున్నారా? అని ప్రశ్నించగా ఆ వివరాలు తెలుసుకొని చెబుతానన్న ఏజీ సమాధానంపైనా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటలూ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఎక్కడికక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
పాజిటివ్ కేసులు ఎన్ని?
‘‘కరోనా పరీక్షల్లో ఎన్ని పాజిటివ్ కేసులు వస్తున్నాయి? కేసుల శాతం ఎంత? మరణాల సంఖ్య ఎంత? కేసుల సంఖ్య ఆధారంగా కంటైన్‌మెంట్ జోన్లు ఎన్ని ఏర్పాటు చేశారు? సీరో సర్వెలైన్స్ చేశారా? అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఎన్ని పరీక్షలు చేశారు? విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఎందరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు? పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో ఎంత మంది పాల్గొనవచ్చో స్పష్టం చేశారా? హైరిస్క్ జోన్లు మార్కెట్లు, రైతు బజార్లు, సినిమా థియేటర్లు, మాల్స్, బార్లు, పబ్బులను పరిమిత సంఖ్యలో అనుమతించేలా ఎందుకు ఆంక్షలు విధించలేదు?’’ అంటూ ధర్మాసనం శరపరంపరగా ఏజీకి ప్రశ్నలు సంధించింది. జీహెచ్‌ఎంసీ, కరీంనగర్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
48 గంటల్లో నివేదిక ఇవ్వండి..
‘‘రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రుల వివరాలపై విస్తృత ప్రచారం నిర్వహించండి. అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించండి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి? అందులో వెంటిలేటర్ బెడ్స్ ఎన్ని, ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పటికి ఎందరు రోగులు ఆసుపత్రుల్లో చేరారు? ఎన్ని కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు? కరోనా నిబంధనలు పాటించని వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంత మందికి జరిమానా విధించారు? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారా? స్వేరో సర్వైలెన్స్ చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో పూర్తి వివరాలతో 48 గంటల్లో నివేదిక సమర్పించండి’’ అని సర్కారును ఆదేశిస్తూ విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది.
చదవండి: ధరణి... వెతల కహానీ
Comments
Please login to add a commentAdd a comment