సాక్షి, మహబూబ్‌నగర్: ‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూపిన మార్గంలో 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్.. డాక్టర్ బాబాసాహెబ్ గారినే కేసీఆర్ అవమానించిండు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము లేక విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ కంటే నిజమైన అంబేడ్కర్‌వాది ఎవరూ లేరు’అని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో రైతు వేదిక, 40 డబుల్ బెడ్‌రూం ఇళ్లతోపాటు ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో సీఎం మాట్లాడారని.. తెలంగాణకు నిధుల కేటాయింపు విషయమై ప్రశ్నించారని.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదన్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా లేక, విషయ పరిజ్ఞానం లేక, భావ దారిద్య్రంతో కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్లు కొందరు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దేశమంతా ‘దళితబంధు’ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా రాష్ట్రానికి పిలిచి సన్మానం చేస్తామన్నారు.
తెలంగాణనూ సమదృష్టితో చూడాలని కోరుకుంటా..
‘నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా’అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 105 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశాయన్నారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు.
2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి రాజ్యాంగ సవరణకు ఒక కమిటీ వేశారని, మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలన్నారని.. వారు కూడా రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లా అని నిలదీశారు. ‘ప్రధాని మోదీ శనివారం సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించేందుకు వస్తున్నారు. ఆయన కలలోకి వెళ్లి తెలంగాణను కూడా సమదృష్టితో చూడాలని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కర్ణాటక, మహారాష్ట్రలతో సమానంగా తెలంగాణను చూడాలని ఆ రామానుజచార్యుల వారిని కోరుకుంటా’అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రం సహకరించడం లేదు..
‘విద్య విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు, 8 ఐఐఎం కళాశాలలు, వందకు పైగా నవోదయ పాఠశాలలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పొరాడు అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాధించింది కేసీఆరే. కేంద్రం కలసి వచ్చినా రాకపోయినా ప్రజాశీర్వాదంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment