
పంజగుట్ట: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడంలేదన్నారు. అల్వాల్ హిల్స్, హైటెన్షన్ రోడ్డులో తనపేరుమీద, తన భార్య, భార్య సోదరి పేరుపై మొత్తం 3.31 ఎకరాల భూమి ఉందని, దీని పక్కనే మైనంపల్లికి చెందిన 1.9 ఎకరాల భూమి ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు.
మైనంపల్లి అనుచరులు తనను చంపేందుకు యత్నిస్తున్నారని, అందుకే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్, డీసీపీని కలిసి తనకు ప్రాణాపాయం ఉందని వివరించినట్లు తెలిపారు. సమావేశంలో మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ కన్వినర్ ఆర్.కె.శ్రీనివాస్, బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్, బీజేపీ నాయకులు జి.కె.హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment