పిల్లలు కనెక్ట్ అయితే ప్లగ్ తీసేయడం కష్టం. టీవీ చానెల్ అయినా.. సీరియల్ క్యారెక్టర్ అయినా. కనెక్ట్ అయ్యారని ఎప్పుడు తెలుస్తుంది? టీవీ ఆఫ్ చేస్తేనో.. చానల్ మారిస్తేనో.. అరిచి గీ పెడతారు. కాళ్లూ చేతులు తన్నేసుకుంటారు. ఇప్పుడు వాళ్లకో విషయం తెలిసింది. చోటా భీమ్.. చుట్కీని మోసం చేశాడని! తట్టుకోలేకపోయారు. జస్టిస్ ఫర్ చుట్కీ అని ఉద్యమించారు! వాళ్లతో కలిసి కొందరు పెద్దవాళ్లూ!!
ఛోటా భీమ్ తన బెస్ట్ ఫ్రెండ్ చుట్కీని వదిలేసి రాజకుమారి ఇందుమతిని పెళ్లి చేసుకున్నాడట!!
ట్విట్టర్‌లో బ్రేకింగ్ న్యూస్.
ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో జరగబోయే పెళ్లిని ఊహించిందెవరు? ఎవరైతే ఏంటి.. నిప్పు లేకుండా పొగ వస్తుందా?!
ట్విట్టర్ బ్రేక్ అయింది. ‘జస్టిస్ ఫర్ చుట్కీ’ ఉద్యమం మొదలైంది.
అవునా! ఆశ్చర్యం.
భీమ్ అలా చేశాడా! ఆగ్రహం.
అయ్యో చుట్కీ! ఆవేదన.
పాపం కదా.. చుట్కీ.. భీమ్‌కి ఎంత హెల్ప్ చేసింది! ఎన్ని లడ్డూలు పెట్టింది! ఎన్ని సాహసాలలో తోడుగా ఉంది! ఎన్ని అపాయాలలో ఉపాయాలు చెప్పింది. ఈ హెల్పులు, లడ్డూలు, ఉపాయాలు కాదు.. అసలు తనని ఎంతగా ప్రేమించింది! ఎప్పుడూ భీమ్ వెంటే ఉండేది. ఎప్పుడూ ఇద్దరూ కలిసే ఉండేవారు. అలాంటి చుట్కీని వదిలేసి డబ్బు కోసం, బంగారం కోసం, రాజభవంతి కోసం ఇందుమతితో వెళ్లిపోయాడా భీమ్!
భీమ్ తన చేతిని వదిలి, రాజకుమారి చేతిని పట్టుకుంటే చుట్కీ హార్ట్ బ్రేక్ అవుతుందో లేదో కానీ.. చోటా భీమ్ సీరియల్‌ను ఫాలో అవుతున్న ప్రతి చిన్నారి మనసు చుట్కీ కోసం తల్లడిల్లిపోతోంది. పెద్దవాళ్లు కూడా అస్థిమితంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. నిజంగా భీమ్ అంత పని చేశాడా!!
చుట్కీ కష్టాల్లో పడ్డాక ఇక టీవీలో చూడ్డానికి ఏముంటుంది?
చుట్కీని వదిలాక భీమ్ ఎన్ని కష్టాలు పడ్డాడో చూడ్డానికైనా టీవీ చూడాలి.
వ్యూయర్స్ రెండుగా విడిపోయారు. ఆ ఇద్దరికీ ఒకటే నినాదం.. జస్టిస్ ఫర్ చుట్కీ.
చుట్కీకి న్యాయం చెయ్యాల్సింది ఎవరు? గ్రీన్ గోల్డ్ యానిమేషన్ వాళ్లు.
‘చోటా భీమ్’ పిల్లల సీరియల్ సృష్టికర్తలు వాళ్లే. ఆ సీరియల్‌లోని పాత్రలే చోటా భీమ్, చుట్కీ, రాకుమారి ఇందుమతి. సృష్టికర్తల చేతుల్లో ఏదైనా ఉంటుంది. తలచుకుంటే భీమ్‌ని మళ్లీ చుట్కీ దగ్గరికి రప్పించగలరు.
భీమ్, చుట్కీ చెట్టపట్టాలు
చోటా భీమ్ సీరియల్ ‘పోగో’ టీవీలో 2008 నుంచి ప్రసారం అవుతోంది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళ్ భాషల్లో వస్తోంది. చోటా భీమ్, చుట్కీ, రాజు, జగ్గు, కాలియా, ధోలు, భోలు, రాజకుమారి ఇందుమతి, కిచక్, చోటా మను, రాజా ఇంద్రవర్మ, ఢాకూ మంగళ్‌సింగ్, ధూనీ బాబా, టున్‌టున్ మౌసీ, ప్రొఫెసర్ శాస్త్రి ధూమకేతు.. అందులోని ప్రతి క్యారెక్టర్ పిల్లలకు ఇష్టమైనదే. ముఖ్యంగా చోటా భీమ్, చుట్కీలు! కామెడీ, డ్రామా, యాక్షన్, అడ్వెంచర్ అన్నీ వీళ్లిద్దరి చుట్టూ తిరుగుతుంటాయి. ఢోలక్‌పూర్ అనే ఒక కల్పిత రాజ్యంలోని తొమ్మిదేళ్ల బాలుడు చోటా భీమ్. ఏడేళ్ల బాలిక చుట్కీ.
‘‘ఈ వయసులో వీళ్లిద్దరికీ పెళ్లెందుకు జరుగుతుంది?! మీరు విన్నది తప్పు. ఎవరూ కలత చెందనవసరం లేదు’’ అని జస్టిస్ ఫర్ చుట్కీ ఆందోళనకారులకు సీరియల్ నిర్మాతలు వివరణ లాంటి అభయం ఇచ్చారు.
ఏమైనా పిల్లల మనసు సున్నితమైనది. మనసులో ఒకటి అల్లుకున్నారంటే అది కళ్ల ముందు చెదిరిపోతుంటే చూసి తట్టుకోలేరు. పెద్దల్లో కూడా కొన్ని పసి హృదయాలు ఉంటాయి. వాళ్లందరి మనసు తెలుసుకుని వాళ్లకెలాగైతే నచ్చుతుందో అలాగే పాత్రల్ని మలుచుకోక తప్పదేమో. పిల్లల కోసం తీసే సీరియళ్ల ప్రత్యేకత ఇదే. తీసేది ఎవరైనా.. తీయించేది చిన్నారులే. చిన్నారులకు నచ్చితే బాగా తీసినట్లే.
ఐ స్టాండ్ విత్ చుట్కీ: ట్విట్టర్‌లో చుట్కీకి మద్దతుగా ఓ పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment