సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ముసాయిదా ఓటర్ల డేటా లీకైందని పలు రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ తోసిపుచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారం, అనవసరంగా ప్రజల మెదళ్లలో అనుమానాలు రేకెత్తించడానికి చేసిన ఆకతాయి చర్యేనని కొట్టిపారేశారు. తన కార్యాలయం నుంచి ఏ డేటా లీక్ కాలేదని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వర్లలో డేటాను సురక్షితంగా భద్రపరిచామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో అంతర్గత అధ్యయనం నిర్వహించామని, ఎక్కడా డేటా బ్రీచ్ జరగలేదని తేలిందన్నారు. పట్టభద్రుల ఓటర్ల డేటా లీకు వివాదంపై బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
వివాదానికి కారణమేంటి?
‘మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో మీరు చోటు సంపాదించారని తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నా.. మెరు గైన సమాజం కోసం పనిచేయడానికి నాకు మీరు మరోసారి అవకాశం, దీవెనలు అందించాలి’అని పేర్కొంటూ బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు ఓటర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపడంవివాదాస్పదమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ల చిరునామా, ఫోన్ నంబర్లుండవు. ఓటరు నమోదులో భాగంగా దరఖాస్తుదారుల నుంచి ఎన్నికల సంఘం ఫోన్ నంబర్లు, చిరునామాలు స్వీకరించింది. ఎన్నికల సంఘం నుంచి ఓటర్ల డేటా లీకైందని ఆరోపిస్తూ పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్‌తో పాటు సీఈఓ కార్యాలయానికి ఫిర్యాదులు చేశాయి.
ఈసీ అనుమతిస్తే ఇస్తాం..: శశాంక్ గోయల్
‘కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా/తుది జాబితాల్లో ఓటర్ల చిరునామాలుండవు. అయితే, ముసాయిదా జాబితాలోని ఓటర్లలో ఎంత మంది నిజమైన ఓటర్లున్నారు? ఎంత మంది బోగస్ ఓటర్లున్నారు? అని క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపడానికి వారి చిరునామాలు ఇవ్వాలని కొన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను నేరుగా కలుసుకోవడానికి, సందేశాలు పంపడానికి వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని మరికొన్ని పార్టీలు సైతం కోరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తే రాజకీయ పార్టీలకు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తాం. లేకుంటే లేదు. ఓటర్ల జాబితా ఫార్మాట్ మార్చి చిరునామా సైతం పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటేనే ఓటర్ల జాబితాలో చిరునామాలు పెట్టగలం. లేకుంటే లేదు..’అని శశాంక్ గోయల్ పేర్కొన్నారు.
అందులో రహస్యం ఏమీ లేదు..
‘ఎస్‌ఎంఎస్‌లు అందరూ పంపుతారు. ఇందులో తప్పేముంది. ఎన్నికల సంఘంతో దీనికి ఏ సంబంధం లేదు. దీనిపై అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు. ఇందులో కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ద్వారా సీఈఓ వెబ్‌సైట్ నుంచి ఓటర్ల చిరునామాలు తీసుకున్నాం. జాబితా ఇస్తే మొత్తం సమాచారాన్ని ఇచ్చే ప్రైవేటు సంస్థలు సైతం ఉన్నాయి’
– ఎన్.రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment