
హైదరాబాద్: ఆస్ట్రేలియాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన శ్రీనివాస్, అరుణ దంపతుల కుమారుడు సాయిసూర్యతేజ 2019లో ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. చదువు పూర్తి కావడంతో రెండు నెలల క్రితం సివిల్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఈ నెల 7న ఆస్ట్రేలియా బ్రిస్బన్ లోని తాను నివాసం ఉంటున్న గోల్డెన్ కాస్ట్ రిసార్ట్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందాడు.
డాక్టర్ సూచనలతో..
2020లో సాయి సూర్యతేజ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడి కాలు ప్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. వచ్చే నెలలో మరో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. శస్త్ర చికిత్స చేయాలంటే స్విమ్మింగ్ చేస్తే బాగుంటుందని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న తన అపార్ట్‌మెంట్ కింద ఉన్న పూల్‌కు వెళ్లిన అతను ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా..
వచ్చే నెలలో సాయి సూర్యకు శస్త్ర చికిత్స జరుగనుండటంతో తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఏప్రిల్ 2న ప్రయాణానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అంతలో కుమారుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో వారు బోరున విలపిస్తున్నారు. మృతుడి స్నేహితు లు సాయి మృతదేహాన్ని నగరానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో మృతదేహం నగరానికి చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు తెలిపారు.
(చదవండి: క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.కోటి ఖాళీ)
Comments
Please login to add a commentAdd a comment