సాక్షి, తిరుపతి: పార్టీలో చేరకముందే ఆ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పరువు తీశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ని కలిశాకే రమ్మని తేల్చిచెప్పడంతో మాజీ ఎమ్మెల్యే షాక్‌కు గురయ్యారు. కండువా కప్పుకోక ముందే ఇదేం పంచాయితీ అంటూ ఎస్సీవీ నాయుడు తలపట్టుకుంటున్నారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేరు వింటే.. తరచూ పార్టీలు మారే నాయకుడని అందరికీ తెలుసు. టీడీపీలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ముఖ్యఅనుచరుడుగా ఉంటూ... ప్రతి ఎన్నికలో ఆయన కోసం పనిచేసేవారు.
అయినా టీడీపీలో గుర్తింపు లేదని భావించి 2003లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సైలెంట్‌గా ఉంటూ.. తన పనులు తాను చేసుకుంటూ ఉండేవారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ నుంచి టికెట్ ఆశించినా ప్రయోజనం లేకపోవడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ టీడీపీలో చేరిపోయారు. టీడీపీ ప్రభుత్వంలో తనను ఎవ్వరూ పట్టించుకోలేదంటూ.. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉండేవారు.
డామిట్.. కథ అడ్డం తిరిగింది
శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జ్ సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ శ్రేణుల్లో మంచి అభిప్రాయం లేకపోవడం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఎస్సీవీ నాయుడు గ్రహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. టీడీపీ నేతలతో సఖ్యతగా ఉండడం ప్రారంభించారు. అందులో భాగంగా ఇటీవల బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంవత్సరీకానికి మరో మాజీ ఎమ్మెల్యేతో కలిసి సుధీర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. పేరుకు సంవత్సరీకానికి వెళ్లామని చెప్పుకున్నా.. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు కుట్రలకు తెరదీశారు. విషయం బయటపడడంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా ఇటీవల చంద్రబాబుని కలిసి.. పార్టీలో చేరికపై నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబుని కలిసిన విషయం, పార్టీలో చేరిక విషయం బొజ్జల సుధీర్‌రెడ్డికి తెలియదు. ఎస్సీవీ నాయుడు చేరిక వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకున్న బొజ్జల సుధీర్‌రెడ్డి బుధవారం వాయిస్ రికార్డు విడుదల చేశారు. ‘ఎస్సీవీ నాయుడు గురువారం పార్టీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ అయిన నాకు ఎటువంటి సమాచారం లేదు. కావున టీడీపీ శ్రేణులు ఎవ్వరూ ఎస్సీవీ నాయుడుతో వెళ్లొద్దు’ అని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఎస్సీవీ చేరికను వాయిదా వేశారు. దీంతో ఎస్సీవీ నాయుడు చేరికపై సందిగ్ధం నెలకొంది.
పోయిన పరువు
పార్టీలో చేరక ముందే అటు చంద్రబాబు.. ఇటు బొజ్జల సుధీర్‌రెడ్డి తన పరువు తీశారని ఎస్సీవీ నాయుడు మనస్తాపానికి గురైనట్లు సమాచారం. టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లన్నీ చేసుకున్నాక నియోజకవర్గంలో ఎలా తలెత్తుకు తిరగాలని అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రతి గెలుపు కోసం నేను ఎంతగా కష్టపడ్డానో చంద్రబాబు తెలియదా? అంతెందుకు.. బొజ్జల కుటుంబానికి తెలియదా?’ ఇంత అవమానం జరిగాక ఈనెల 14న కుప్పంకి ఎలా వెళ్లాలి? పార్టీలో ఎలా చేరాలి. ఒక వేళ చేరినా.. అడుగడుగునా అవమానించరని గ్యారెంటీ ఉందా..?’ అని తన అనుచరుల వద్ద ఎస్సీవీ తీవ్ర మనోవేదనకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment