
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీ, జనసేన గందరగోళంలో పడ్డాయి. ప్రజాబలం లేకపోవడం, మరో వైపు అభ్యర్థుల కొరత ఆ రెండు పార్టీలను పట్టిపీడిస్తున్నాయి. నోటాకు వచ్చే ఓట్లు కూడా రాని బీజేపీ శ్రీకాళహస్తిపై ఆశలు పెట్టుకుంది. టీడీపీ–జనసేన పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆ రెండు పార్టీల శ్రేణులు అధికారంలోకి వచ్చేసినట్లు ఎవరికి వారు సీట్లు ప్రకటించుకుంటున్నారు. అందులో భాగంగా తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి తామేనంటూ పసుపులేటి హరిప్రసాద్, మరో వైపు కిరణ్‌రాయల్ ప్రకటించుకుంటున్నారు.
లేదు లేదు తామే పోటీలో ఉన్నామంటూ టీడీపీ చెప్పుకుంటోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ, జనసేనకు చెందిన కొందరు ఓ ఒప్పందానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ లేదా నాగబాబు పోటీ చేస్తే తాము తిరుపతి టికెట్‌ని త్యాగం చేస్తామని కొందరు టీడీపీ శ్రేణులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరిసింహయాదవ్ వర్గీయులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇన్నేళ్లు పార్టీని నమ్ముకుని, పార్టీ కోసం కష్టపడుతుంటే, పొత్తంటూ వచ్చి తిరుపతి టికెట్ తన్నుకెళ్తామంటే ఒప్పుకునేది లేదని భీష్మించుకున్నారు. వీరిద్దరూ కాకుండా మరో ఇద్దరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
చిత్తూరు తీసుకోండి
చిత్తూరులో టీడీపీని నమ్ముకుని ఉన్న మాజీ మేయర్ కఠారి హేమలత, గీర్వాణి చంద్రప్రకాష్‌ను ప్రస్తావించకుండా ఆ పార్టీ అధినాయకులు జనసేనకు ఆఫర్ ఇచ్చారు. చిత్తూరులో బలమైన అభ్యర్థులు లేరని, కావాలంటే జనసేన నుంచి ఎవరైనా పోటీచేస్తే తాము మద్దతు ఇస్తామని టీడీపీ అధినాయకత్వం చెప్పినట్లు సమాచారం. అయితే టీడీపీలోని కొందరు తమను సంప్రదించకుండా జనసేనకు ఎలా మాట ఇస్తారని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది.
అధిష్టానం ఏదైనా ఆదేశిస్తే ముందుండి చేసేది మేమైతే.. పొత్తంటూ జనసేనకు ఇవ్వడం ఎంత వరకు న్యాయం అని ఆ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభ్యర్థులు, ప్రజాబలం లేని జనసేన పార్టీ గంగాధరనెల్లూరు, సత్యవేడు నుంచి కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించుకుంటున్నారు. ఎవరినీ సంప్రదించుకుండా జనసేన వారు లేని పోని ప్రచారాలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు
శ్రీకాళహస్తిలో మూడు ముక్కలాట
నోటాకు వచ్చే ఓట్లు కూడా రాని బీజేపీ శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని స్థానిక నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగా తానే అభ్యర్థి అని కోలా ఆనంద్ చెప్పుకుంటున్నారు. తాము పోటీ చేస్తాను కాబట్టి జనసేన శ్రేణులు తమకే మద్దతు ఇవ్వాలని కమలనాథులు కోరుతున్నారు. అదెలా కుదురుతుంది, తామే పోటీచేస్తామంటూ జనసేన అంటోంది. ఈ రెండు పార్టీలు ఇలా ఉంటే, పొత్తులో భాగంగా జనసేన టీడీపీకి మద్దతు ఇస్తుందని బొజ్జల సుధీర్‌రెడ్డి, మరో వైపు ఎస్సీవీ నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు.
బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా, శ్రీకాళహస్తి కమలనాథులు తమకే మద్దతు ఇస్తారని చెప్పడం గమనార్హం. తెలంగాణాలో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుంటే, ఏపీలో జనసేన టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించింది. టీడీపీ మాత్రం ఎన్నికల బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మేలు చేసేందుకు పరోక్షంగా మద్దతు ఇస్తోంది. 2019 ఎన్నికల్లో ఒకే సీటుతో సరిపెట్టుకున్న టీడీపీ, ఉనికే లేని జనసేన, నోటా ఓట్లు కూడా రాని బీజేపీ ఎవరికి వారు తాము పోటీ చేస్తున్నాం అంటూ ప్రచారం చేసుకుంటుంటే జనం నవ్వుకుంటున్నారు. అధికారం కోసం ఇంతగా దిగజారటం ఏంటో ఇటు ఓటర్లూ, అటూ రాజకీయ పార్టీలు అయోమయంలో మునిగిపోయారు.