సమీప బంధువుల నిశ్చితారానికి కుటుంబ సభ్యులంతా కలిసి కారులో చైన్నెకి తరలివెళ్లారు. అక్కడ శుభకార్యాన్ని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. నిశ్చితార్థంలో జరిగిన మధురస్మృతులను గుర్తుచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాసేపట్లో ఇంటికి చేరుతామనగా మార్గ మధ్యంలో ఓ ట్రాక్టర్‌ను అదిగమించబోయి ఎదురుగా వస్తున్న కళాశాల బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన నారాయణవనం బైపాస్‌పై శుక్రవారం సాయంత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
తిరుపతి : నారాయణవనం బైపాస్ రోడ్డులో శుక్రవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. పుత్తూరు రూరల్ మండలం పరమేశ్వరమంగళం గ్రామానికి చెందిన రమేష్ నాయుడు(60), అతడి భార్య పుష్ప (55), వదిన వనజాక్షి (60), మరో అన్న కుమార్తె భాను (53), తమ్ముడి భార్య శివమ్మ(52) సమీప బంధువుల ఇంట్లో నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు కారులో తమిళనాడులోని పెరంబూరుకు శుక్రవారం ఉదయం వెళ్లారు. రమేష్‌నాయుడు డ్రైవింగ్‌లోనే కారులో తిరుగుప్రయాణమయ్యారు. నారాయణవనం సమీపంలోని రాళ్లకాలువ వంతెన వద్ద ముందు వెళుతున్న చెరుకు ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోతూ ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ కళాశాల బస్సును కొట్టాడు.
దీంతో రమేష్ నాయుడు, పుష్ప, భాను, వనజాక్షి అక్కడికక్కడే మరణించారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో రమేష్‌నాయుడు, పుష్ప మృత దేహాలను అతికష్టం మీద వెలికి తీశారు. వెనుక సీటులో ఉన్న వనజాక్షి తల నుజ్జు నుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన శివమ్మను 108 వాహనంలో పుత్తూరు ప్రభుత్వాపత్రికి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలవడంతో ప్రథమ చికిత్స చేయించి, ఇంటికి పంపినట్లు ఎస్‌ఐ పరమేష్ నాయక్ వెల్లడించారు.
తీరని విషాదం
రమేష్‌నాయుడు కుటుంబం మృత్యువాత పడినట్లు తెలియగానే స్వగ్రామం పరమేశ్వరమంగళంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి భోరున విలపించారు. శుభకార్యానికి వెళ్లి మృత్యువాత పడ్డారే అంటూ రోదించారు.
ప్రమాదకరమార్గం
నారాయణవనం బైపాస్ రోడ్డులో గత రెండేళ్లలోనే వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారని, అయినప్పటికీ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టలేదని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment