నిద్రమత్తు ఆ కుటుంబాన్ని చిదిమేసింది. దైవదర్శనాలకొచ్చిన ఒకే కుటుంబానికి చెందిన నలుగుర్ని మింగేసింది. ఆనందంగా జీవితాలను పంచుకుంటూ వెళ్లదీస్తున్న బంధుమిత్రులకు కన్నీళ్లు మిగిల్చింది. శ్రీకాళహస్తి–నాయుడుపేట జాతీయ రహదారి, మేర్లపాక చెరువు వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యారు. నిద్ర మత్తే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తిరుపతి: మండలంలోని మేర్లపాక చెరువు కట్ట వద్ద గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. ఏర్పేడు సీఐ శ్రీహరి కథనం.. తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, దంతాలపల్లి మండలం, దంతాలపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ(65)కు అశోక్(45), దినేష్(42), రాంబాబు(40) ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు దినేష్‌కు శాన్వితాక్షరి(4), భాన్వితాక్షరి(10) కుమార్తెలు ఉన్నారు. వెంకటమ్మ మూడు రోజుల క్రితం దంతాలపల్లి నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి కుమారులు, కోడళ్లు, మనుమరాళ్లతో రెండు కార్లలో బయలుదేరారు. బుధవారం రాత్రి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.
తర్వాత గురువారం ఉదయం టీఎస్26ఈ7432 మారుతీ బెలాన్‌లో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి వెంకటమ్మ కుమారులు అశోక్, దినేష్, రాంబాబు, మనుమరాళ్లు శాన్వితాక్షరి, భాన్వితాక్షరి, మరో కారులో కోడళ్లు, కుటుంబ సభ్యులతో తిరుపతి నుంచి బయలుదేరారు. వెంకటమ్మ చిన్న కుమారుడు రాంబాబు కారును నడుపుతున్నాడు. అదేసమయంలో శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఏర్పేడు మండలం, మేర్లపాక చెరువు కట్ట వద్ద ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో వెంకటమ్మ, పెద్ద కుమారుడు అశోక్, చిన్న మనుమరాలు శాన్వితాక్షరి అక్కడికక్కడే మృతిచెందారు. రెండో కుమారుడు దినేష్, మనుమరాలు భాన్వితాక్షరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దినేష్ మృతిచెందాడు. రాంబాబుకు స్వల్ప గాయాలయ్యాయి.
నిద్ర మత్తే కారణం
నిద్ర మత్తే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాంబాబు మూడు రోజులుగా తెలంగాణ నుంచి కారును నడుపుతున్నాడు. గురువారం నిద్ర మత్తుతో ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నట్టు చెబుతున్నారు.
ఉలిక్కిపడ్డ గ్రామస్తులు
మేర్లపాక గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. చెరువుకట్ట వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం.. క్షతగాత్రులు, మృతులతో పరిసరాలు నిండిపోవడంతో భయాందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment