మహిళ తన కలలను సాకారం చేసుకోగలిగేది కుటుంబ అవసరాలన్నీ పూర్తయిన తర్వాతే. అంటే అన్ని బాధ్యతలు తీరాక అప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే అది ఆమె అదృష్టంగా మారుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కోయంబత్తూర్ వాసి 84 ఏళ్ల లలితాంబాల్ భారతదేశం బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆరు దశాబ్దాల తన కలను నెరవేర్చుకుంటోంది. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను ఈ రిటైర్డ్ టీచర్ అధిగమిస్తున్న విధానం చాలా ఆసక్తిదాయకంగానూ, ఎంతోమంది అనుసరించదగినదిగానూ ఉంటుంది.
60వ దశకంలో లలితాంబాల్ జాగ్రఫీ, హిస్టరీ టీచర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో ఆమె ప్రపంచాన్ని పర్యటించాలని కలలు కనేవారట. కానీ ఆమెకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఒక విదేశీ గడ్డపై అడుగుపెట్టింది.
పాస్‌పోర్ట్ వచ్చిన వేళ
‘‘చిన్నవయసులోనే పెళ్లి అవడం, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలకేప్రా ధాన్యం ఇస్తూ వచ్చాను. అదే నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఆర్థిక కష్టాలు, ఇతరప్రా ధాన్యాలతో కుటుంబ భవి ష్యత్తు వైపే ఉండటానికి నిర్ణయించు కున్నాను. నా సమయమంతా అందుకే కేటాయించాను. అయితే, నా కలలు మాత్రం ఎప్పుడూ నన్ను వీడిపోలేదు. పుస్తకాల్లో చదివిన విషయాలు, విద్యార్థులకు బోధించే సమయంలోనూ ‘ఎప్పుడైనా బయట ప్రపంచం వైపుగా ప్రయాణం చేయగలనా..’ అని అనుకునేదాన్ని. కానీ, ప్రయాణం మాట అటుంచితే కనీసం పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేకపోయాను. రెండేళ్ల క్రితం నా కూతురు మేఖల పాస్‌పోర్ట్‌కు అప్లై చేయమని చెప్పింది. ప్రయత్నించాను. 83 ఏళ్ల వయసులో నా చేతుల్లోకి పాస్‌పోర్ట్ వచ్చింది.
నాలుగేళ్ల క్రితం..
నెదర్లాండ్స్‌లో నా మనవరాలు స్థిరపడింది. తన పొదుపు మొత్తంతో నా కలను నిజం చేయడానికి తను బాధ్యత తీసుకుంది. నా దగ్గర కూడా కొంత పొదుపు మొత్తాలున్నాయి. అయితే, మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా నా భర్త మరణించడంతో అన్నీ ఆగిపోయాయి.
యూరప్ అంతా...
ప్రస్తుతం ఉన్న వయసు, ఆరోగ్యస్థితి కారణంగా విదేశాలకు వెళ్లగలనా, కుటుంబంలో మిగతా అందరికీ ఆందోళనగా మారుతుందా అని మొదట్లో సంకోచించాను. కానీ, పిల్లలు ఇచ్చిన ధైర్యంతో ఎట్టకేలకు ఆమ్‌స్టర్‌డామ్‌లో దిగాను. మా అమ్మాయితో కలిసి మూడు నెలల పాటు యూరప్ అంతా ప్రయాణించాను. భౌగోళికం, చరిత్రలో విద్యార్థులకు బోధించిన విషయాలు కళ్లారా చూడటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అందులో ఒక ఉదాహరణ.. రిజ్క్ మ్యూజియంలోని అతి పెద్ద వాటర్లూ యుద్ధం పెయింటింగ్ చూసి ఊపిరి పీల్చుకున్నాను. ఊహల్లోకంటే వాస్తవికంగా చూసినప్పుడు ఆ పెయింటింగ్ మరింత అద్భుతంగా అనిపించింది.
ఈతరాణిగా..
విమానాల్లో తిరగడం, నీటిపై లాంచీలో విహారం ఎన్నో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతితో కలిసి ప్రజలు సాగిస్తున్న జీవితాలను చూశాను. ఒక ట్రిప్ నుండి మరొక ట్రిప్‌కు వెళ్లడంలో ఎన్నో భయాలు దూరమయ్యాయి. నా చిన్నతనం కేరళలో గడిచింది. మేమున్నప్రా ంతంలో ‘ఈతరాణి’ అనే పేరుండేది నాకు. కానీ, ఆ తర్వాత జీవనంలో అదీ మర్చిపోయాను. 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈత కొడుతున్నాను. ఒకప్పుడు స్వేచ్ఛగా ఈదుతూ భవిష్యత్తు గురించి కొంచెం ఎక్కువ కలలు కనే అదే చిన్న అమ్మాయిగా ఇప్పుడు మారిపోయాను.
లొంగిపోవద్దు..
నాకు స్వతంత్రంగా ఉండే మహిళలంటే చాలా గౌరవం. వారి శక్తి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలోనే ఎన్నో పోరాటాలు, గందరగోళాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పరిస్థితులు లేదా వ్యక్తులకు ఎప్పుడూ వంగి, ఆధిపత్యానికి లొంగిపోవద్దు. మీ మూలాలను అస్సలు మరచిపోవద్దు. ఆర్థిక స్వాతంత్య్రం ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో సొంత నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. ఇదే విషయం చెబుతూ నా ఇద్దరు పిల్లలను, ముగ్గురు మనవళ్లను పెంచాను. ఇప్పుడు వారి సాయంతో నా దశాబ్దాల కలను నెర వేర్చుకుంటున్నాను’’ అని చెబుతుంది లలితాంబాల్. 84 ఏళ్ల వయసులో మహిళలు విస్తృతంగా ప్రయాణించడం చాలా అరుదు. కానీ, లలితాంబాల్ జీవన ప్రయా ణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment