విశాఖపట్నం: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి వాంబే కాలనీలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గాజువాక ఏసీపీ త్రినాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వాంబేకాలనీలో నివసిస్తున్న కొత్తకోట లక్ష్మి (27), సంతోష్ దంపతులు. కొద్ది సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ఉపాధి కోసం వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
ఇద్దరూ కూలిపనులు చేసుకుని జీవించేవారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం పనికి వెళ్లిన సంతోష్ రాత్రి ఇంటికి వచ్చేసరికి లక్ష్మి ఉరి వేసుకుని ఉండటంతో, వెంటనే ఆమదాలవలసలో ఉంటున్న లక్ష్మి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.
స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న గాజువాక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సంతోష్, లక్ష్మి మధ్య మనస్పర్థలున్నాయని, వరకట్న వేధింపులు కూడా కలహాలకు కారణమని ఇరుగుపొరుగు వారు తెలిపారు. సంతోష్ మద్యానికి బానిసై నిత్యం లక్ష్మిని వేధింపులకు గురి చేసేవాడని తెలియజేశారు. అదనపు కట్నం తేవాలని తమ కుమార్తెను నిత్యం వేధించేవాడని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏసీపీ త్రినాథ్ కేసు దర్యాప్తు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment