అదుర్స్‌.. సిరి ధాన్యాల టిఫిన్స్‌.. తింటే లాభాలేంటో తెలుసా? | - | Sakshi
Sakshi News home page

అదుర్స్‌.. సిరి ధాన్యాల టిఫిన్స్‌.. తింటే లాభాలేంటో తెలుసా?

Published Sat, Jul 15 2023 12:32 AM | Last Updated on Sat, Jul 15 2023 8:49 AM

- - Sakshi

ఒకప్పుడు పేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు అందరి మెనూలో చేరాయి. ‘ఫాస్ట్‌ఫుడ్‌’ యుగంలో ఈ చిరుధాన్యాలేంటి అనుకుంటున్నారా? ‘సూపర్‌ ఫుడ్‌.. వండర్‌ గ్రెయిన్‌’ మిల్లెట్‌ ప్రస్తావన వచ్చినప్పుడు నిపుణులు చెప్పే మాట ఇది. 30 ఏళ్లకే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, సుగర్‌ వంటి వివిధ రకాల వ్యాధులు నగర వాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేశాయి.

రోగాలు వచ్చినప్పుడు మాత్రలు మింగే బదులు.. అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని గుర్తించారు. అందుకే ‘చిరుధాన్యాలతో ఆరోగ్య సిరి’ అంటున్నారు నగర ప్రజలు. ప్రజల అభిరుచికి అనుగుణంగా మహా నగరంలో మిల్లెట్‌ హోటళ్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఇక్కడ ‘ఆహా’ అనేలా సిరి ధాన్యాల వంటకాలు నోరూరిస్తున్నాయి. 

విశాఖపట్నం: ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. జీవనశైలి వ్యాధులకు దూరంగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బతికిన నిన్నటి తరం ఆహారపు అలవాట్లను నేటి తరం ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తోంది. అందుకు తగినట్లుగానే తీసుకునే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తి, ఊరట పొందేందుకు పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే సజ్జలు, కొర్రలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అందుకే పేద, ధనిక తేడా లేకుండా అందరి మెనూలోనూ ఇప్పుడు మిల్లెట్స్‌ భాగమయ్యాయి. దీంతో అనూహ్యంగా వీటికి డిమాండ్‌ పెరిగింది. మిల్లెట్స్‌పై మరింత అవ గాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.

ఏమిటీ చిరుధాన్యాల గొప్ప?
ఇప్పుడు అన్నం తింటున్నాం.. అంతా బాగానే ఉంది కదా? ప్రత్యేకంగా చిరుధాన్యాలను ఎందుకు తినాలి? పైగా కొన్ని రకాల మిల్లెట్స్‌తో పోలిస్తే.. గోధుమలు, రైస్‌ చాలా రుచిగా ఉంటాయి కదా అనే వాళ్లు చాలా మంది ఉంటారు. అన్నంతో పోలిస్తే చిరుధాన్యాల్లో ప్రొటీన్‌, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌, విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా గ్లూటెన్‌ ఉండదు.

చాలా రకాల మిల్లెట్స్‌లో 10 శాతం ప్రొటీన్‌, 3.5 శాతం లిపిడ్స్‌ ఉంటాయి. రాగుల్లో అయితే ఏకంగా 12–16 శాతం ప్రొటీన్‌ ఉంటుంది. 2–5 శాతం లిపిడ్స్‌ ఉంటాయి. తక్కువ కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. జొన్నల్లో డైటరీ ఫైబర్‌, విటమిన్లు, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, కాపర్‌, మాంగనీస్‌ లాంటివన్నీ ఉంటాయి. వీటివల్ల ఊబకాయం, షుగర్‌, గుండెపోటు లాంటి సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.

మిల్లెట్స్‌ వంటలకు ఫుల్‌ డిమాండ్‌
నగరంలో చిరుధాన్యాల వంటకాలకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. బీచ్‌రోడ్డు, ద్వారకానగర్‌, సిరిపురం, పాత డెయిరీ ఫారం, మధురవాడ, గాజువాక, ఎండాడ, మురళీనగర్‌, టౌన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా మిల్లెట్‌ ఆధారిత హోటళ్లు, రెస్టారెంట్లు వెలిశాయి. కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు వంటి చిరు ధాన్యాలతో పాటు పెసర్లు, శనగల మొలకలతో చేసే టిఫిన్లు దొరుకుతున్నాయి. మిల్లెట్లతో తయారు చేసే కిచిడీ, పూరీ, ఫ్రైడ్‌ రైస్‌, బిర్యానీ, బ్రెడ్‌, పొంగల్‌, చద్దన్నం, ఇడ్లీ, చాట్‌, వెజ్‌ మిల్లెట్‌ బాత్‌, రోటీ, పాన్‌కేక్‌, పిజ్జా, బర్గర్‌, పాయసం, దోశలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో రుచులు బాగా ఫేమస్‌ అయ్యాయి. ఎండాడలోని ఓ హోటల్‌లో రాగి పాత్రల్లో మిల్లెట్స్‌ వంటకాలు వండి.. వినియోగదారులకు అందిస్తున్నారు.

ఇక్కడ లభించే మిల్లెట్‌ పాకం గారెలు, రాగి దోశ కోసం వినియోగదారులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారంటే అతిశయోక్తి కాదు. హెల్త్‌ కోసమే కాకుండా వీటిని రుచి కోసం తినేవాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన వాసెన్‌పోలి సెంటర్‌లో మిల్లెట్స్‌తో తయారుచేసిన రుచికరమైన ఇడ్లీ, దోశలు దొరుకుతున్నాయి. వీటి కోసం ఉదయం వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఇక మిల్లెట్‌ ఉత్పత్తులను విక్రయించే షాపులు కొకొల్లలు. సూపర్‌ మార్కెట్‌లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి వీటిని విక్రయిస్తున్నారు.

రూ.10 కోట్లకు పైగా టర్నోవర్‌
విశాఖలో ఏడాదికి మిల్లెట్స్‌ టర్నోవర్‌ రూ.10 కోట్లకు పైనే ఉంటోంది. నగరంలో ఈ తరహా ఉత్పత్తులు విక్రయించే స్టోర్స్‌ 28 వరకు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కొంత మంది స్టోర్‌ ట్రేడర్లు రైతుల వద్ద నుంచి నేరుగా మిల్లెట్‌ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుండగా.. ఎక్కువ శాతం పూర్ణమార్కెట్‌లోని సప్లయర్స్‌ నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. నంద్యాల ప్రాంతం నుంచి కొర్రలు ఎక్కువగా నగరానికి వస్తుండగా.. కర్ణాటకలోని రాయచూర్‌ నుంచి అండు కొర్రలు, ఒడిశా నుంచి సామలు దిగుమతి అవుతున్నాయి. మన మన్యంలో సైతం రైతులు మిల్లెట్లను పండిస్తున్నారు.

అందరికీ ఆరోగ్యం లక్ష్యం
మా దగ్గర ఉదయం, సాయంత్రం మూడు రకాల్లో ఇడ్లీ లభిస్తుంది. మిల్లెట్స్‌ చద్దనాన్ని ఇష్టపడి తింటారు. చిరుధాన్యాల్లో ఎనిమిది రకాల లేయర్లు ఉంటాయి. అందుకే చద్దన్నం కోసం మిల్లెట్స్‌ను 8 గంటల పాటు నానబెడతాం. తర్వాత 2 గంటల పాటు ఉడకబెట్టి.. తర్వాత 8 గంటల పాటు మజ్జిగలో పులియబెడతాం. ఉల్లి, పచ్చిమిర్చి, క్యారెట్‌ తురుము వేసి వినియోగదారులకు అందిస్తాం. బఠానీతో చాట్‌, పాయసం బాగా ఫేమస్‌. ఎవరైనా మిల్లెట్‌ వంటకాల తయారీ నేర్చుకోవాలంటే అవగాహన కల్పిస్తాం. వ్యాపార కోణంలో కాకుండా అందరికీ ఆరోగ్యం పంచడమే మా లక్ష్యం.
– శేఖర్‌, జగదమ్మ నేచురల్స్‌, పాత డెయిరీ ఫారం, ఆరిలోవ

ఆరోగ్యానికి మేలు చేస్తాయి
ఎండాడలోని సోమా హోటల్‌లో విభిన్న రుచుల్లో పదార్థాలు అందిస్తున్నారు. తినడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ రాగి ఇడ్లీ, పాకం గారెలు తింటాం. మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీపీ, షుగర్‌తో పాటు అనారోగ్య సమస్యలు ఉన్న వారే వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అలా కాకుండా అందరూ మిల్లెట్స్‌ను వినియోగించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. నేచురల్స్‌ స్టోర్‌ల్లో రాగులు, కొర్రలు, సామలు వంటి రా మెటీరియల్‌తో పాటు పిండ్లు కూడా లభిస్తున్నాయి. వాటితో ఇంట్లోనే నచ్చిన పదార్థాలు కూడా తయారు చేసుకోవచ్చు.
– డాక్టర్‌ ఎం.ప్రసన్న లక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement