పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్‌ | Sakshi
Sakshi News home page

పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్‌

Published Mon, May 6 2024 4:15 AM

పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్‌

భీమునిపట్నం : పద్మనాభం మండలంలోని తునివలస పంచాయతీ పరిధిలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. అక్కడి టీడీపీ సర్పంచ్‌ అభ్యర్థి అల్లు అప్పలరాజు ఆధ్వర్యంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ సుంకర గిరిబాబు సహకారంతో ఆదివారం సాయంత్రం భీమిలిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వార్డు మెంబర్లు మజ్జి నాగరాజు, లచ్చుబోతు ఈశ్వరరావు, సూర్యారావుతోపాటు టీడీపీకి చెందిన 300 కుటుంబాల సభ్యులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఎంత గొప్పగా సాగిందో ప్రతి ఒక్కరూ చూడడంతోపాటు ఆయన అందించిన సంక్షేమ ఫలాలు అందరూ పొందారన్నారు. సీఎం జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయగలరో అది మాత్రమే చెప్పి మేనిఫెస్టోను విడుదల చేయడం చాలా గొప్ప విషయమన్నారు. అదే చంద్రబాబునాయుడు అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంతో ప్రజలు నమ్మడం లేదన్నారు. సీఎం జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పాలన కొనసాగుతుందని అందరూ విశ్వసిస్తున్నారని... అందుకే అందరూ వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా వున్నారన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఎన్నో పరిశ్రమలు, కంపెనీలు రావడంతో ఎక్కువ మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని తెలిపారు. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నానన్నారు. టీడీపీ అభ్యర్థి గంటాను గెలిపిస్తే ఎవ్వరికీ కనిపించకుండా పోతాడని, ఈ విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని కోరారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా, బొత్స ఝాన్సీలక్ష్మిని విశాఖ ఎంపీగా గెలిపించాలని కోరారు. టీడీపీ సర్పంచ్‌ అభ్యర్థి అల్లు అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పనితీరు ఎంతో నచ్చడం వల్లే తామంతా వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుడు కిలారి సూర్యనారాయణ, సుంకర బంగారప్పడు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలోకి తునివలసకు చెందిన

300 కుటుంబాలు

సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే

ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Advertisement
Advertisement