నేటి నుంచి బాదుడే
● 15 నుంచి 131 శాతం భూముల విలువ పెంపు ● భారం కానున్న రిజిస్ట్రేషన్ చార్జీలు ● చివరి రోజు శుక్రవారం రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు ● రాత్రి 10 దాటినా పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ● కొనిసార్లు మొరాయించిన సర్వర్
విశాఖ సిటీ: విశాఖలో భూముల విలువ శనివారం నుంచి గణనీయంగా పెరగనుంది. మునుపెన్నడూ లేని విధంగా 15 శాతం నుంచి 131 శాతం వరకు భూముల విలువలను సవరించారు. దీంతో ఫ్లాట్లు, ప్లాట్లతో పాటు వ్యవసాయ భూములు కొనుగోలు చేసే వారిపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం భారీగా పడనుంది. ఈ పెరిగిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. అధికారంలోకి వస్తే ఏ చార్జీలు పెంచబోమని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వరుసగా ప్రజలపై భారాలు మోపుతూపోతోంది. రెండు నెలల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్ చార్జీలను సైతం పెంచింది. ఇప్పటికే విశాఖలో భూములు ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో సైతం గజం ధర రూ.30, రూ.40 వేలుగా ఉంది. ఇటువంటి తరుణంలో రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా భారీగా పెరగడంతో మధ్య తరగతి ప్రజలు సొంతింటిని కొనుగోలు చేయడం కష్టసాధ్యంగా మారనుంది. విశాఖలో భూముల విలువ సవరణల ద్వారా రూ.150 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కిక్కిరిసిన కార్యాలయాలు
పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. 1వ తేదీ నుంచి అత్యల్పంగా 15 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో చివరి రోజు శుక్రవారమే చాలా మంది కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడ్డారు. దీంతో అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. సాధారణ రోజుల్లో ఒక్కో కార్యాలయంలో 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ భూముల విలువ పెరగడంతో చివరి రెండు రోజులు రోజుకు 60 నుంచి 70 రిజిస్ట్రేషన్లు జరిగాయి. శుక్రవారం కూడా అదే స్థాయిలో క్రయ, విక్రయదారులతో కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. రాత్రి 10 గంటల తరువాత కూడా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment