దారి తప్పిన ‘మహా ప్రస్థానం’
మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన నిరుపేద రోగుల మృతదేహాలను ఉచితంగా వారి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం మహా ప్రస్థానం వాహనాలను ప్రవేశపెట్టింది. అయితే అవి నేడు కొందరి అత్యాశకు దారి తప్పుతున్నాయి. ఉచితంగా అందించాల్సిన సేవలకు సైతం కొందరు డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తూ పేద ప్రజలను మరింత బాధిస్తున్నారు. ఒక్కో మృతదేహాన్ని తరలించేందుకు రూ. 2వేల నుంచి రూ. 3 వేల వరకు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో పేద ప్రజలకు మృతదేహాల తరలింపు భారం కాకూడదని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రైవేట్ వాహనాలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించే సౌకర్యాన్ని కల్పించింది. కేజీహెచ్‌లో ప్రారంభంలో ఆరు వాహనాలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను తొమ్మిదికి పెంచారు. రోజుకు 25 నుంచి 30 మృతదేహాలను ఈ వాహనాల ద్వారా తరలిస్తున్నారు.
అయితే కొందరు డ్రైవర్లు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి, ఉచితంగా అందించాల్సిన సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లో, రోడ్డు ప్రమాదాల్లో, ఎంఎల్‌సీ కేసుల్లో మరణించిన వారి బంధువుల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే మృతదేహాలను మధ్యలోనే వదిలి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులు డ్రైవర్లు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. వాస్తవానికి కేజీహెచ్ నుంచి అనకాపల్లి, విజయనగరం వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించేందుకు అనుమతి ఉంది. అంతేకాకుండా మృతుల బంధువుల అభ్యర్థన మేరకు, సంబంధిత అధికారుల అనుమతితో అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఈ వాహనాల ద్వారా మృతదేహాలను తరలిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల జీతాలు, ఇంధన ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చులను ఇంటిగ్రేటెడ్ హెల్త్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. వీరు ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. ఇటీవల ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై పాడేరుకు తీసుకువెళ్లిన సంఘటన పేదల కష్టాలను కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేయడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పేదలను దోచుకుంటున్న డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మృతదేహాల తరలింపునకు రూ.2 వేలు
వసూలు చేస్తున్న వాహన డ్రైవర్లు
వాస్తవానికి ఈ తరలింపు పూర్తి ఉచితం
వాహనాల నిర్వహణ బాధ్యత కేజీహెచ్‌దే..
కానీ మరణించిన వారి కుటుంబ సభ్యుల
నుంచి దౌర్జన్యంగా డబ్బుల వసూళ్లు
Comments
Please login to add a commentAdd a comment