మహిళలకిచ్చిన హామీలేమయ్యాయి?
సీతమ్మధార: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ‘గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు.. అది మన హక్కు’ అనే నినాదంతో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ పాలకుల మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, చేతల్లో లేదని విమర్శించారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేదికగా మారిపోతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం హామీలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజ్యాంగం అందించిన సమానత్వం 75 ఏళ్లు అయినా సాధ్యం కాలేదని, నిత్యం మహిళా సమాజంపై దాడులు పెరుగుతున్నా పాలకులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో మహిళా సమాజం మరో వంద ఏళ్లు వెనక్కి వెళ్లిపోతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా దినోత్సవం అందించిన పోరాట స్ఫూర్తితో మహిళలు మరింత చైతన్యవంతంగా ఉద్యమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎం.ఎ.బేగం, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె.వనజాక్షి, నాయకులు ఎ.దేవుడమ్మ, అరుణ, అన్నపూర్ణ, జి.జయ, బి.పుష్పలత, పావని పాల్గొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం,తల్లికి వందనం అమలు ఎప్పుడు?
మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమల
Comments
Please login to add a commentAdd a comment